TikTok: సింగపూర్ సర్వర్ లో భారతీయుల డేటా: టిక్ టాక్
- డేటా ఇవ్వాలని చైనా కోరలేదు
- కోరినా ఇచ్చే ప్రసక్తే లేదు
- టిక్ టాక్ సీఈఓ కెవిన్ మేయర్
ఇండియాలో టిక్ టాక్ కస్టమర్లకు చెందిన సమాచారాన్నంతా సింగపూర్ లో ఉన్న సర్వర్లలో దాచి వుంచామని టిక్ టాక్ సీఈఓ కెవిన్ మేయర్ వ్యాఖ్యానించారు. ఈ సమాచారాన్ని అందించాలని చైనా ప్రభుత్వం తమను కోరలేదని, ఒకవేళ కోరినా, దాన్ని ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. భారత జాతీయ భద్రత, ప్రాదేశిక సమగ్రత దృష్ట్యా, చైనా యాప్ లను నిషేధించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో వివరణ ఇవ్వాలని యాప్ సంస్థలకు నోటీసును కూడా ఇచ్చింది.
మిగతా నిషేధించబడిన యాప్ లతో పోలిస్తే, అత్యధిక నష్టం టిక్ టాక్ కే సంభవించింది. ఈ నేపథ్యంలో కెవిన్ మేయర్ ఓ లేఖ ద్వారా ప్రభుత్వాన్ని సంప్రదించారు. సమీప భవిష్యత్తులో ఇండియాలోనే సర్వర్లను ఏర్పాటు చేస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారని సమాచారం. తాము మరే దేశానికీ భారత కస్టమర్ల గురించిన సమాచారాన్ని, వారి డేటాను పంచుకోలేదని ఆయన తన లేఖలో స్పష్టం చేశారు.
కాగా, ప్రస్తుతానికి టిక్ టాక్ కు ఊరట లభించే అవకాశాలు లేవని తెలుస్తోంది,. 59 చైనా యాప్ లపై విధించిన నిషేధాన్ని తొలగించే ఆలోచనలో కేంద్రం లేదు. చైనాతో సరిహద్దుల్లో నెలకొన్న విభేదాల నేపథ్యంలో ఈ అంశం జాతి భద్రతతో ముడిపడటంతో టిక్ టాక్ కు చట్టపరమైన ఊరట కూడా అంత సులువుగా లభించకపోవచ్చని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు.