Rakesh Mishra: ఎవరేం చేసినా... డిసెంబర్ లోపు వ్యాక్సిన్ రావడం కష్టం: సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా
- హ్యూమన్ ట్రయల్స్ విజయవంతం కావాలి
- అది జరిగేందుకే కనీసం 8 నెలలు పడుతుంది
- ఏ దేశం విజయవంతమైనా వచ్చే ఏడాదే వ్యాక్సిన్
ఎంత భారీ స్థాయిలో క్లినికల్ ట్రయల్స్ చేసినా ఈ సంవత్సరం చివరిలోగా కరోనాకు వ్యాక్సిన్ రావడం చాలా కష్టమని సీఎస్ఐఆర్ - సీసీఎంబీ సంచాలకులు రాకేశ్ మిశ్రా అభిప్రాయపడ్డారు. తాజాగా ఓ పత్రికతో మాట్లాడిన ఆయన, కరోనాకు వైరస్ కోసం ఎన్నో దేశాలు ప్రయోగాలు చేస్తున్నాయని, అవన్నీ వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు.
చెబుతున్నట్టుగా అత్యంత కచ్చితత్వంతో జరిగితే, మరో ఎనిమిది నెలల్లో వ్యాక్సిన్ వస్తుందని భావించవచ్చని అంతకన్నా త్వరగా ఒకటి, రెండు నెలల్లో వచ్చే అవకాశాలు లేవని ఆయన అన్నారు. జబ్బున పడిన వారికి మందుబిళ్ల ఇచ్చినట్టు ఇచ్చి, తగ్గిందా? లేదా? అని చూసేందుకు ఇదేమీ డ్రగ్ కాదని, వైరస్ శరీరంలోకి వస్తే, దాన్ని నిలువరించే యాంటీబాడీలను అంతకు ముందే సిద్ధం చేయాల్సిన వ్యాక్సిన్ అని ఆయన అన్నారు.
అన్ని వయసుల వారికి, రుగ్మతలు ఉన్నవారికి కూడా ఈ వ్యాక్సిన్ సరిపోతుందా? అన్నది తేల్చడం కూడా కీలకమైన అంశమని అన్నారు. వాస్తవానికి వ్యాక్సిన్ ను తయారు చేయాలంటే, ఎన్నో సంవత్సరాలు పడుతుందని, కానీ, ప్రజలు ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు కాబట్టి, ఏ దేశంలోని ఏ కంపెనీ విజయవంతమైనా, వచ్చే సంవత్సరం వ్యాక్సిన్ వస్తుందని రాకేశ్ మిశ్రా పేర్కొన్నారు. తనకు అర్థమైనంత వరకూ అంతకన్నా ముందు మాత్రం వచ్చే అవకాశాలు లేవని స్పష్టం చేశారు.
కాగా, ఐసీఎంఆర్, భారత్ బయోటెక్, పుణె వైరాలజీ ల్యాబ్ కలసి తయారు చేస్తున్న కరోనా వ్యాక్సిన్, కోవాక్సిన్ ఆగస్టు 15 నాటికి వస్తుందన్న ప్రకటన వెలువడగా, ఇంకా హ్యూమన్ ట్రయల్స్ కూడా ప్రారంభించని వైరస్ ను మార్కెట్లోకి విడుదల చేస్తామని ఎలా ప్రకటిస్తారన్న విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.