Intermittent Fasting: 'అప్పుడప్పుడూ ఉపవాసం'... ఇప్పుడిదే కొత్త ట్రెండ్!

Intermittent Fasting grows as a new trend

  • మారుతున్న జీవనశైలికి అనుగుణంగా ఆహార అలవాట్లు
  • బాగా ప్రచారం అందుకుంటున్న కొత్త ఆహార దృక్పథం
  • ఓ ట్రెండ్ లా మారిన 'ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్'

ఆసియా దేశాల్లో ఆహారపు అలవాట్లకు, పాశ్చాత్య దేశాల్లో ఆహారపు అలవాట్లకు ఎంతో తేడా ఉంటుంది. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి వేళ కూడా భోజనం చేయడం భారత్ వంటి దక్షిణాసియా దేశాల్లో ఎన్నో ఏళ్లుగా పాటిస్తున్నారు. అయితే ఇప్పుడా ట్రెండ్ లో మార్పు వచ్చింది. ప్రతి ఒక్కరికీ ఆరోగ్యంపైనా, తమ శరీరాకృతిపైనా శ్రద్ధ పెరుగుతుండడంతో, వారి ఆహార స్వీకరణ దృక్పథంలో కొత్తదనం కనిపిస్తోంది. ఆ మార్పు పేరే 'ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్'. అంటే 'అడపాదడపా ఉపవాసం' ఉండడం.

భారతీయ సంస్కృతిలో ఉపవాసాల వెనుక శాస్త్రీయకోణం కూడా ఉందని చెబుతారు. అసలు విషయానికొస్తే... ఈ విధానంలో ఫలానా ఆహారం తినాలి, ఫలానా ఆహారం తినకూడదన్న నియమాలేవీ ఉండవు. మీరేం తినాలన్నది ఈ విధానం నిర్దేశించదు కానీ, మీరెప్పుడు తినాలన్నదే ఇక్కడ మ్యాటర్. ఇందులో కొన్ని రకాల పద్ధతులున్నాయి. వాటిలో ముఖ్యమైనవి 16:8 విధానం, 24 గంటల ఉపవాసం, 5:2 డైట్.

16:8 విధానంలో కేవలం రెండు సార్లు మాత్రమే ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. అంటే మధ్యాహ్నం 1 గంటకు ఆహారం తీసుకుంటే మళ్లీ రాత్రి 9 గంటలకు భోజనం చేయాల్సి ఉంటుంది. మధ్యలో 8 గంటల విరామం ఉంటుంది. రోజుకు 24 గంటలు కావడంతో ఈ విధానంలో మిగతా 16 గంటల పాటు ఉపవాసం ఉన్నట్టే.

ఇక 24 గంటల ఉపవాసం విధానంలో వారంలో ఒకసారి కానీ, రెండుసార్లు కానీ ఉపవాసం ఉండాలి. అంటే ఈ రాత్రికి డిన్నర్ తీసుకుంటే మళ్లీ రేపటి రాత్రి డిన్నర్ తీసుకునేంతవరకు మధ్యలో ఏమీ తినకూడదు.

చివరిది 5:2 డైట్. ఇందులో వారంలో ఐదు రోజుల పాటు ఏదైనా తినొచ్చు, ఎంతైనా తినొచ్చు. కానీ వారంలో రెండ్రోజుల పాటు మాత్రం కేవలం 500 నుంచి 600 కెలోరీలు ఇచ్చే ఆహారం మాత్రమే తినాలి. ఈ రెండ్రోజులు వరుసగా కాకుండా మధ్యలో విరామం ఇవ్వాలి.

ఈ 'అడపాదడపా ఉపవాసం' విధానం ద్వారా అనేక లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా, బరువు తగ్గడం ఎంతో సులువు అని, శరీరంలో ఇన్సులిన్ శాతాన్ని నియంత్రించే ప్రక్రియలు సాఫీగా జరుగుతాయని అంటున్నారు. ముఖ్యంగా పురుషుల్లో బ్లడ్ షుగర్ లెవల్స్ సాధారణ స్థితికి చేరడం, టైప్ 2 డయాబెటిస్ వచ్చే ముప్పు తగ్గడం దీని ద్వారా కలిగే లాభాలు. వార్ధక్యం వేగాన్ని తగ్గించడం, మృత కణాల సంఖ్యను తగ్గించడం, కొవ్వును కరిగించడం, కండర కణజాలం పెంపు ఈ విధానం ద్వారా సమకూరే మరికొన్ని ప్రయోజనాలు.

అయితే, డయాబెటిస్ తో బాధపడుతున్నవాళ్లు, అనోరెక్సియా, బులిమియా వంటి ఆహార సంబంధ రుగ్మతలతో బాధపడుతున్నవాళ్లు, గర్భవతులు, బాలింతలు ఈ ఆడపాదడపా ఉపవాసం జోలికి వెళ్లకపోవడం మంచిదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News