WHO: డిసెంబరు 31నే కరోనా గురించి మేం తెలిపాం: డబ్ల్యూహెచ్ఓ కొత్త వాదన
- చైనా కంటే ముందు తెలిపాం
- వుహాన్‌లో న్యుమోనియా వంటి కేసులు బయటపడ్డాయి
- వీటి వెనుక ఉన్న కారణాల గురించి స్పష్టంగా తెలియలేదు
- సమాచారం ఇవ్వాలని చైనాను కోరాం
- చైనా జనవరి 3న తెలిపింది
కరోనా వైరస్ గురించి ప్రపంచానికి తెలపడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) జాప్యం చేసిందని ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వస్తోన్న నేపథ్యంలో ఆ సంస్థ తాజాగా మరో వాదనను తెరపైకి తీసుకొచ్చింది. కరోనా సమాచారాన్ని చైనా కంటే ముందు ఆ దేశంలోని తమ ఆఫీసే తెలియజేసిందని ప్రకటన చేసింది.
వుహాన్‌లో న్యూమోనియా వంటి కేసులు నమోదైన సమయంలో కరోనాకు సంబంధించిన సమాచారాన్ని గత ఏడాది డిసెంబర్ 31న తమ ఆఫీస్ తెలిపిందని చెప్పింది. అదే రోజు అమెరికాలోని డబ్ల్యూహెచ్ఓ ఇంటర్నేషనల్ ఎపిడిమియోలాజికల్ నిఘా నెట్‌వర్క్ ప్రోమెడ్ కూడా వుహాన్‌లో న్యుమోనియా కేసులు బయటపడినట్టు, వీటి వెనుక ఉన్న కారణాల గురించి స్పష్టంగా తెలియడం లేదని వెల్లడించిందని తెలిపింది.
అయితే, ఆ నివేదికను పరిశీలించి కొత్తరకం వైరస్ కేసుల గురించి తాము జనవరి 1, 2 తేదీల్లో చైనా అధికారులను సమాచారం కోరామని చెప్పింది. దీంతో ఈ వివరాలను చైనా జనవరి 3న తెలిపిందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. తాము చైనా పట్ల పక్షపాత ధోరణి చూపడం లేదని చెప్పుకొచ్చింది.
తమకు అందిన సమాచారాన్ని అధికారికంగా ధ్రువీకరించి, దాని గురించి సమాచారాన్ని విశ్లేషించి చెప్పడానికి ఆయా దేశాలకు 48 గంటల సమయం ఉంటుందని చెప్పారు. తాము ఈ సమాచారం ఇవ్వాలని కోరిన వెంటనే చైనా అధికారులు డబ్ల్యూహెచ్‌ఓను సంప్రదించారని తెలిపింది. కాగా, డబ్ల్యూహెచ్ఓ ఈ ఏడాది ఏప్రిల్ 9న ఈ విషయంపై ప్రకటన చేసింది. చైనా నుంచి తొలి నివేదిక వచ్చిందని ఈ నెల 20న డబ్ల్యూహెచ్ఓ ప్రకటన చేసింది.