UPI Payments: జూన్‌లో జీవితకాల గరిష్ఠానికి యూపీఐ చెల్లింపులు
- జూన్‌లో రూ.2.62 లక్షల కోట్ల విలువైన 134 కోట్ల లావాదేవీలు
- ఏప్రిల్‌లో దారుణంగా పడిపోయిన యూపీఐ చెల్లింపులు
- మే నెలతో పోలిస్తే జూన్‌లో 8.94 శాతం పెరుగుదల
యూపీఐ చెల్లింపులు జూన్‌లో రికార్డు స్థాయికి చేరుకున్నాయి. దాదాపు రూ.2.62 లక్షల కోట్ల విలువైన 134 కోట్ల లావాదేవీలు జరిగినట్టు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) తెలిపింది. ఇది జీవితకాల గరిష్ఠమని పేర్కొంది. అంతకుముందు నెలలో 2.18 లక్షల కోట్ల రూపాయల విలువైన 123 కోట్ల లావాదేవీలు జరిగాయి. అంటే మే నెలతో పోలిస్తే జూన్‌లో లావాదేవీలు 8.94 శాతం పెరిగాయి.
అయితే, దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లో ఉన్న ఏప్రిల్‌లో మాత్రం యూపీఐ లావాదేవీలు 99.57 కోట్లకు పరిమితమైనట్టు ఎన్‌పీసీఐ తెలిపింది. ఈ చెల్లింపుల విలువ రూ. 1.51 లక్షల కోట్లని వివరించింది. లాక్‌డౌన్ సడలింపుల అనంతరం ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడంతో మే నెలలో తిరిగి యూపీఐ లావాదేవీలు ఊపందుకోగా, గత నెలలో ఇవి జీవితకాల గరిష్ఠానికి చేరుకున్నాయి. గతేడాది అక్టోబరు నుంచి 100 కోట్లకుపైగా లావాదేవీలు నమోదవుతూ వస్తుండగా, ఈ ఏడాది ఏప్రిల్‌లో తొలిసారి అంతకంటే తక్కువ నమోదయ్యాయి.