Nitya Menen: బరువు పెరిగితే ఏదేదో ఊహించుకుంటుంటారు.. 'బాడీ షేమింగ్'పై నిత్యా మీనన్ స్పందన!
- మన కంటే సన్నగా ఉండే వాళ్ల నుంచే విమర్శలు ఎదురవుతాయి
- బరువు పెరిగితే అనారోగ్య సమస్యలు ఉన్నాయనుకుంటారు
- ఇలాంటి విమర్శలపై నేను ఎవరినీ ప్రశ్నించను
హీరోయిన్లలో నిత్యామీనన్ కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్ లో సైతం తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆమె అలరించింది. అయితే, తన శరీర బరువు విషయంలో మాత్రం ఆమె విమర్శలను ఎదుర్కొంటోంది. పలువురు నెటిజెన్లు ఆమెపై బాడీ షేమింగ్ (శరీరాన్ని చూసి వెక్కిరించడం)కు పాల్పడుతున్నారు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.
మనకంటే లావుగా ఉన్నవాళ్ల నుంచి మనకు విమర్శలు ఎదురుకావని... మనకంటే సన్నగా ఉండే వాళ్ల నుంచే విమర్శలు ఎదురవుతాయని నిత్య వ్యాఖ్యానించింది. అసలు బరువు ఎందుకు పెరుగుతున్నావని ఎవరూ ప్రశ్నించరని... ఎవరికి వారు ఏదో ఊహించుకుంటూ ఉంటారని... ఏవో అనారోగ్య సమస్యలు ఉన్నాయని అనుకుంటున్నారని, ఎవరి ఇష్టానికి వారు ఆలోచించుకుంటారని చెప్పింది.
తన బరువు గురించి విమర్శలు ఎదురైనప్పుడు తాను ఎవరినీ ఎదురు ప్రశ్నించలేదని, బాధ పడలేదని తెలిపింది. ఇలాంటివన్నీ చాలా చిన్న విషయాలని చెప్పింది. ఇలాంటి వాటిని ఎవరికి వారే అధిగమించాలని చెప్పింది. ఇలాంటి కామెంట్లపై పోరాటం చేయడాన్ని తాను నమ్మనని వ్యాఖ్యానించింది. ఇండస్ట్రీ వ్యక్తులు తనను చూస్తున్నారా? లేక తన బరువును చూస్తున్నారా? అనే విషయాన్ని తాను పట్టించుకోనని చెప్పింది. తన పని తాను చూసుకుంటూ పోతానని, తన పనే విమర్శకులకు సమాధానం చెపుతుందని వ్యాఖ్యానించింది. 'మిషన్ మంగళ్' చిత్రం ద్వారా గత ఏడాది నిత్య బాలీవుడ్ లో అడుగుపెట్టింది.