Joe Biden: అధికారంలోకి రాగానే హెచ్1బీ వీసాలపై సస్పెన్షన్‌ను ఎత్తేస్తాను: జో బిడెన్ హామీ
- హెచ్1బీ వీసాలపై ట్రంప్ తాత్కాలిక సస్పెన్షన్
- ఈ వీసాదారులు అమెరికాకు గొప్ప సేవలు చేశారన్న బిడెన్
- ఇమ్మిగ్రేషన్ సవరణ బిల్లును ప్రతినిధుల సభకు పంపుతాను
- ట్రంప్ ఇమ్మిగ్రేషన్ పాలసీలు చాలా క్రూరంగా ఉన్నాయి
హెచ్1బీ వీసాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒకలా మాట్లాడుతోంటే, డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన జో బిడెన్ మరోలా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో కరోనా వైరస్ వల్ల నిరుద్యోగం రికార్డు స్థాయికి పెరిగిపోవడంతో డొనాల్డ్ ట్రంప్ హెచ్1బీ వీసాలతో పాటు మరికొన్ని వీసాలపై తాత్కాలిక నిషేధం విధించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో, నవంబరులో జగరనున్న అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి తాను అధికారంలోకి వస్తే హెచ్1బీ వీసాలపై విధించిన తాత్కాలిక సస్పెన్షన్‌ను ఎత్తివేస్తానని జో బిడెన్ ప్రకటించారు. తాజాగా, ఎన్నికల ప్రచార సమావేశంలో పాల్గొన్న జో బిడెన్ ఈ వ్యాఖ్యలు చేసి, హెచ్1బీ వీసాదారులు తమ దేశానికి అందించిన సేవలను కొనియాడారు.
'ఆయన (డొనాల్డ్ ట్రంప్) హెచ్1బీ వీసాలను ఈ ఏడాది చివరి వరకు రద్దు చేశారు. అయితే, నా పాలనలో మాత్రం వాటిపై నిషేధం ఉండదు' అని చెప్పారు. 'ఈ దేశ అభివృద్ధిలో వారు కీలక పాత్ర పోషించారు. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తొలిరేజే ఇమ్మిగ్రేషన్ సవరణ బిల్లును యూఎస్ ప్రతినిధుల సభకు పంపుతాను. అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్స్ ఇండియన్ ఆరిజిన్ (ఏఏపీఐ)కు చెందిన 1.7 మిలియన్ల మంది సహా 11 మిలియన్ల మందికి అమెరికా పౌరసత్వం ఇచ్చేందుకు రోడ్ మ్యాప్ కోసం కృషి చేస్తాను' అని జో బిడెన్ తెలిపారు.
'వారు మన దేశానికి గొప్ప సేవలు అందించారు. ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను ఆధునికీకరిస్తాను. ట్రంప్ ఇమ్మిగ్రేషన్ పాలసీలు చాలా క్రూరంగా ఉన్నాయి' అని తెలిపారు. కాగా, హెచ్1 బీతో పాటు ఇతర వర్క్ వీసాల జారీని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రద్దు చేయడంతో భారతీయ ఐటీ నిపుణుల నెత్తిపై పిడుగుపడినట్లయిన విషయం తెలిసిందే.