Corona Virus: కరోనాకు మేడిన్ ఇండియా వాక్సిన్... ప్రయోగదశలో వున్న 'కోవాక్సిన్' విశేషాలివి!
- హ్యూమన్ ట్రయల్స్ కు అనుమతి
- వ్యాక్సిన్ తయారు చేసిన భారత్ బయోటెక్
- సహకరించిన ఐసీఎంఆర్, ఎన్ఐవీ
భారత ఔషధ నియంత్రణా మండలి, ఇటీవలే భారత్ బయోటెక్ ఇండియా లిమిటెడ్ (బీబీఐఎల్) తయారు చేసిన కరోనా వాక్సిన్ 'కోవాక్సిన్'ను మానవులపై ప్రయోగించేందుకు అనుమతించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సిన్ ను బీబీఐఎల్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసింది. ఈ నెలలోనే హ్యూమన్ ట్రయల్స్ కూడా ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ గురించిన విశేషాలను పరిశీలిస్తే...
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఆధ్వర్యంలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీతో ఏర్పాటు చేసుకున్న భాగస్వామ్యంతో భారత్ బయోటెక్ ఈ వ్యాక్సిన్ ను తయారు చేసింది. తమ భాగస్వామ్యంలో భాగంగా, కరోనా సోకిన వ్యక్తి నుంచి వైరస్ ను సేకరించి, దాన్ని ల్యాబ్ లో అభివృద్ధి చేసిన వైరాలజీ నిపుణులు, మే నెలలో దాన్ని భారత్ బయోటెక్ కు అందించారు. ఈ వైరస్ ను హైదరాబాద్ లోనే వ్యాక్సిన్ తయారీకి అనుకూలంగా ఉండేందుకు క్రియారహితంగా మార్చడం జరిగింది.
"ఈ వైరస్ క్రియా రహితమైంది. అంటే చనిపోయిందని అర్థం. దీన్ని వ్యాక్సిన్ రూపంలోకి మార్చి మానవ శరీరంలోకి ప్రవేశపెడితే, వారి ఆరోగ్యాన్ని వైరస్ దెబ్బతీయబోదు. శరీరంలోకి ప్రవేశించిన తరువాత పునరుత్పత్తి కూడా ఉండదు. ఇది కేవలం శరీరంలోని రోగ నిరోధక శక్తిని ప్రేరేపిస్తుంది. దీంతో శరీరంలో వైరస్ ను తట్టుకుని సమర్థవంతంగా హతమార్చే యాంటీబాడీలు తయారవుతాయి" అని సంస్థ పేర్కొంది. క్రియారహిత వ్యాక్సిన్లు గతంలో ఎన్నో రోగాల నుంచి మానవులను రక్షించడంతోనే కరోనా విషయంలో తాము ఈ విధానాన్ని అవలంబిస్తున్నామని సంస్థ పేర్కొంది.
తొలి దశలో 'కోవాక్సిన్'ను గునియా పందులు, చుంచుల్లోనూ ప్రయోగించనున్నారు. ఆపై ఫలితాలను పరిశీలించిన తరువాత, తదుపరి దశలో ఎంపిక చేసిన మానవులకు ఇవ్వనున్నారు. తొలి దశ, రెండో దశ క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తయితే, ఈ వాక్సిన్ మార్కెట్లోకి రావడానికి మార్గం సుగమం అవుతుంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ విజయవంతం కావాలని పలువురు అభిలషిస్తున్నారు.
ఇక మానవులపై ప్రయోగాలు మొదలైతే, తొలుత ఎంత వ్యాక్సిన్ ఇవ్వవచ్చు? ఎంత వ్యాక్సిన్ ఇస్తే, కరోనా వైరస్ తో యుద్ధం చేయడానికి సరిపడినంత యాంటీ బాడీలు తయారవుతాయి? వంటి విషయాలను శాస్త్రవేత్తలు పరిశీలిస్తారు. ఇదే దశలో సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయా? అన్న విషయంపైనా రీసెర్చ్ జరుగుతుంది. రెండో దశలో భారీ సంఖ్యలో తాము ఎంపిక చేసుకున్న వలంటీర్లకు వ్యాక్సిన్ ఇచ్చి ఫలితాలను పరిశీలిస్తారు. వీరిలో పురుషులు, స్త్రీలు ఉంటారు. ఇక్కడ వెలువడే ఫలితాలే కీలకం.
ఆపై మూడు, నాలుగో దశ ట్రయల్స్ జరుగుతాయి. ఆఖరి దశలో వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కరోనా వైరస్ ను కూడా పంపి, ఫలితాలను నమోదు చేయాల్సి వుంటుంది. ప్రస్తుతానికి ఈ వ్యాక్సిన్ మానవులపై ఏ మేరకు పనిచేస్తుందన్న విషయమై కచ్ఛితంగా వివరాలను వెల్లడించలేమని, తమ రీసెర్చ్ ఫలితాలు, తొలి దశ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని భారత్ బయోటెక్ ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు.