Pakistan: పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు జర్దారీకి షాకిచ్చిన యాంటీ కరప్షన్ కోర్టు.. అరెస్ట్ వారెంట్ జారీ!
- లగ్జరీ వెహికల్స్ కొనుగోలు కేసులో నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ
- తన క్లయింట్ వయోవృద్ధుడని.. కరోనా పరిస్థితి మెరుగుపడిన తర్వాత కోర్టుకు హాజరవుతారన్న లాయర్
- లాయర్ విన్నపాన్ని తిరస్కరించిన కోర్టు
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు, మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో భర్త ఆసిఫ్ అలీ జర్దారీకి ఆ దేశ యాంటీ కరప్షన్ కోర్టు షాకిచ్చింది. 2008 నాటి లగ్జరీ వెహికల్స్ కేసులో విచారణకు గైర్హాజరైనందుకు అరెస్ట్ వారంట్ జారీ చేసింది. ఇదే కేసులో మాజీ ప్రధానులు నవాజ్ షరీఫ్, యూసఫ్ రజా గిలానీ కూడా నిందితులుగా ఉండటం గమనార్హం.
కేసు విచారణ సందర్భంగా జర్దారీ తరపు న్యాయవాది వాదిస్తూ... తన క్లయింట్ వయోవృద్ధుడని కోర్టుకు తెలిపారు. ఆయన కోర్టు విచారణకు హాజరైతే కరోనా బారిన పడే అవకాశం ఉందని... అందువల్ల కోర్టు హాజరుకు మినహాయింపును ఇవ్వాలని కోరారు. కరోనా పరిస్థితి మెరుగుపడిన తర్వాత కోర్టుకు జర్దారీ హాజరవుతారని చెప్పారు. అయితే, ఆయన విన్నపాన్ని కోర్టు తిరస్కరించింది. నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ను జారీ చేస్తూ... తదుపరి విచారణను ఆగస్టు 17కి వాయిదా వేసింది.
కేసు వివరాల్లోకి వెళ్తే... లగ్జరీ కార్లను కేవలం 15 శాతం మాత్రమే చెల్లించి జర్దారీ, షరీఫ్ తీసుకున్నారని... దీని వల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని కేసు నమోదైంది. వీరు కార్లను తీసుకోవడానికి వీలుగా అప్పటి ప్రధాని గిలానీ నిబంధనలను సడలించారంటూ ఆయన పేరును కూడా చార్జ్ షీట్ లో పొందుపరిచారు.