KCR: ఆయన జీవితమంతా సంస్కరణలతోనే ముందుకు సాగింది: సీఎం కేసీఆర్

cm kcr remembers pv

  • సంపూర్ణ వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి పీవీ నరసింహారావు
  • ఆయన ప్రధాని అయ్యే సమయానికి దేశం అంధకారంలో ఉంది
  • మన్మోహన్ సింగ్‌ ను ఆర్థిక శాఖ మంత్రిని చేశారు
  • దేశం ఎదుర్కొంటోన్న ఆర్థిక దుస్థితి నుంచి గట్టెక్కింది

సంపూర్ణ వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి పీవీ నరసింహారావు అని సీఎం కేసీఆర్ అన్నారు. పీవీ శత జయంతి ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్‌లోని నక్లెస్‌ రోడ్డులో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 'ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన నాయకుడు పీవీ. ఆయన జీవితమంతా సంస్కరణలతోనే సాగింది. ఏ హోదాలో పనిచేసినా తాను చేయగలిగినంత గొప్ప పనులు చేసేవారు. తాను నమ్మింది.. అనుకున్నది గొప్పగా చేసిన వ్యక్తి ఆయన' అని చెప్పారు.

'ఆయన ప్రధాని అయ్యే సమయానికి దేశం అంధకారంలో ఉంది. మన దేశంలోని బంగారాన్ని ఇతర దేశాల్లో పెట్టుకుంటోన్న సమయంలో, ఆర్థికంగా దేశ పరిస్థితి క్లిష్టంగా ఉన్న సమయంలో ప్రధాని మంత్రి పదవిని పీవీ చేపట్టారు. ఎంతో గొప్పగా దేశాన్ని ముందుకు నడిపించారు. అప్పటివరకు రాజకీయాల్లో లేని వ్యక్తిని మన్మోహన్ సింగ్‌ ను ఆర్థిక శాఖ మంత్రిని చేశారు' అని కేసీఆర్ చెప్పారు.

'ఆయన ద్వారా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. దేశం ఆర్థిక దుస్థితి నుంచి గట్టెక్కింది. విద్యా శాఖ పేరును కూడా హెచ్‌ఆర్‌డీగా మార్చింది ఆయనే. ఆయనే గురుకుల పాఠశాలలను ప్రారంభించారు. జైళ్ల శాఖలోనూ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు' అని కేసీఆర్ తెలిపారు.

'సహాయకులు ఉన్నప్పటికీ ఆయనే స్వయంగా తన కంప్యూటర్‌ను ఆపరేట్‌ చేసుకునేవారు. ప్రైవేటు రంగంతో ప్రభుత్వ రంగ సంస్థలు పోటీ పడే స్థాయికి ఆయన అన్ని రంగాల్లోనూ సంస్కరణలు చేశారు. ఆయన వ్యక్తిత్వ పటిమను అభివర్ణించేందుకు మాటలు చాలవు. ఆయన గొప్ప సంస్కరణ శీలి.. సంస్కరణాభిలాషి. ఏ రంగంలో అడుగుపెట్టినా ఆ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చారు. ఆయన నిరంతర విద్యార్థి, సామాజిక దృక్పథం గల వ్యక్తి' అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News