dasari arun: చిరంజీవి గారు పేరు ఇందులోకి ఎందుకు వచ్చిందో నాకు తెలియదు: ఆస్తి వివాదంపై దాసరి కుమారుడు అరుణ్
- ఆస్తి వివాదంలో మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగారని వార్తలు
- ఖండించిన దాసరి అరుణ్ కుమార్
- తమ ఇల్లు తన సోదరి, సోదరుడు, తనకు చెందినదని వ్యాఖ్య
- కూర్చొని చర్చించుకుంటే పరిష్కారమయ్యే సమస్యని వ్యాఖ్య
దివంగత సినీ దర్శకుడు దాసరి నారాయణరావు కుమారులు అరుణ్ కుమార్, ప్రభుల మధ్య ఆస్తి తగాదాలు మరోసారి తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. అర్ధరాత్రి తమ ఇంట్లోకి ప్రవేశించి బీరువా తెరిచేందుకు ప్రయత్నించాడని ఆరోపిస్తూ అరుణ్‌పై ఆయన సోదరుడు ప్రభు నిన్న పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
తనపై ప్రభు చేసిన ఆరోపణపై అరుణ్ ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న ఇంటి విషయంలో తమిద్దరి మధ్య వివాదం తలెత్తిన అంశంపై ఆయన వివరణ ఇచ్చారు. తమ మధ్య చెలరేగిన ఆస్తి వివాదంలో మెగాస్టార్ చిరంజీవి గారు రంగంలోకి దిగారని, వారి మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నంలో ఉన్నారంటూ వచ్చిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా దాసరి అరుణ్ ఖండించారు.
'చిరంజీవి గారి పేరు ఇందులో ఎందుకు వచ్చిందో కూడా నాకు తెలియదు. అనవసరంగా ఆయన పేరును ఇందులోకి లాగుతున్నారు. ఈ విషయానికి, ఆయనకు ఎలాంటి సంబంధం లేదు' అని ఆయన తెలిపారు. తన సోదరి, సోదరుడితో తనకు విభేదాలు లేవని చెప్పుకొచ్చారు. తమకు సన్నిహితంగా ఉండే కొందరు సినీ పెద్దలకు నిన్న తాను ఫోను చేశానని చెప్పారు.
'మా ఇల్లు ముగ్గురికీ చెందినది.. ఏ ఒక్కరిదీ కాదు. అన్నయ్యకు ఏమైనా సమస్యలుంటే పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు. న్యాయ పోరాటం చేయొచ్చు. అందుకు నేను కూడా సిద్ధంగా ఉన్నాను. అన్ని అంశాలను వివరించేందుకు సిద్ధంగా ఉన్నాను' అని చెప్పారు.
'ఆ ఇంటి విషయంలో మా అన్నయ్య దగ్గర కోర్టు ఉత్తర్వు ఏమైనా ఉందా? ఆస్తికి సంబంధించిన వీలునామా ఉంటే చూపించాలి. మా అన్నయ్య, సోదరితో నాకు ఎలాంటి వివాదం లేదు. నాపై కేసు పెట్టారు. చేయి చేసుకున్నానని అన్నారు. నేను లేడీస్‌పై చేయి చేసుకోవడం ఏంటీ? అవన్నీ అబద్ధాలు. అరగంట కూర్చొని చర్చించుకుంటే పరిష్కారమయ్యే సమస్య మాది' అని వ్యాఖ్యానించారు.