Food Courts: తెలంగాణ వ్యాప్తంగా కోతుల కోసం ఫుడ్ కోర్టులు
- ఆహారం కోసం జనావాసాలపై పడుతున్న కోతులు
- జంటనగరాల్లోనూ కోతుల బెడద
- సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్
తెలంగాణలో ఇటీవల కోతుల బెడద అధికమైంది. కోతులు ఆహారం కోసం అడవులు వదిలి జనావాసాలపై పడుతున్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లోనూ కోతులు ప్రతాపం చూపుతుండడంతో సీఎం కేసీఆర్ ఈ సమస్యపై ఓ సమీక్ష సమావేశంలో చర్చించారు. ఇక మీదట తెలంగాణ వ్యాప్తంగా కోతుల కోసం మంకీ ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ ఫుడ్ కోర్టుల్లో కోతులు ఇష్టంగా తినే ఫలాలను ఇచ్చే చెట్లను పెంచుతారు. తద్వారా కోతులకు ఆహారం సమృద్ధిగా దొరుకుతుందని, దాంతో అవి గ్రామాల్లోకి, పట్టణాల్లోకి రావడం తగ్గుతుందని భావిస్తున్నారు.
పైలెట్ ప్రాజెక్టుగా పలు జిల్లాల్లో మంకీ ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేయనున్నారు. గ్రామాలు, పట్టణాల వెలుపల 20 కుంటల స్థలంలో ఫుడ్ కోర్టు ఏర్పాటు చేసి, విస్తృతంగా పండ్లనిచ్చే మొక్కలు నాటనున్నారు. వాటికి అటవీప్రాంతంలో ఆహారం దొరికే ఏర్పాటు చేస్తే జనావాసాలపై పడడం తగ్గుతుందని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు.