Directors: 65 ఏళ్లకు పైబడిన నటులను కూడా షూటింగులకు అనుమతించండి: దర్శకుల సంఘం విజ్ఞప్తి
- దేశంలోని అన్ని ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి
- 65 ఏళ్లకు పైబడిన వారు ఇంటి వద్దే ఉండాలంటున్న ప్రభుత్వాలు
- దిగ్గజాలు లేకుండా సినిమాలు ఎలా పూర్తి చేయగలమన్న దర్శకులు
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కట్టలు తెంచుకుంటోంది. లాక్ డౌన్ ఆంక్షల ఎత్తివేత కారణంగా పాజిటివ్ కేసుల సంఖ్యలో ఒక్కసారిగా భారీ పెరుగుదల కనిపిస్తోంది. ఈ క్రమంలో 65 ఏళ్లకు పైబడిన వృద్ధులు ఇంటి వద్దే ఉండాలంటూ ప్రభుత్వాలు తమ మార్గదర్శకాల్లో పేర్కొంటున్నాయి. ఈ నిబంధన తమకు అడ్డంకిగా మారిందని భారత చలనచిత్ర, టీవీ దర్శకుల సంఘం పేర్కొంటోంది.
65 ఏళ్లకు పైబడిన అమితాబ్ బచ్చన్, అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, నసీరుద్దీన్ షా, శత్రుఘ్న సిన్హా, ధర్మేంద్ర, జాకీ ష్రాఫ్ వంటి నటులు, శ్యామ్ బెనెగల్, డేవిడ్ ధావన్ వంటి దర్శకులు బయటికి రాలేకపోతున్నారని పేర్కొంది. దిగ్గజాలు లేకుండా సినిమా చిత్రీకరణలు ఎలా పూర్తిచేయగలమని అంటోంది. చిత్ర పరిశ్రమ కార్యకలాపాలు కొనసాగాలంటే అందరి తోడ్పాటు అవసరమని, అందుకే వయసు పైబడిన సినీ తారలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ దర్శకుల సంఘం మహారాష్ట్ర సర్కారుకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు లేఖ రాసింది. తమ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని, పరిశీలించి తగు నిర్ణయం తీసుకోవాలని కోరింది.