Canada: లాక్ డౌన్ నిబంధనలు సడలించగానే... కొడుకుని తీసుకుని ఐస్ క్రీమ్ తినేందుకు వెళ్లిన కెనడా ప్రధాని ట్రుడావో!
- కరోనా నేపథ్యంలో లాక్ డౌన్
- ఇటీవలే నిబంధనల సడలింపు
- వెనీలా ఐస్ క్రీమ్ తిన్న ట్రుడావో
కరోనా మహమ్మారి అణచివేతకు లాక్ డౌన్ ప్రకటించి, ఇప్పుడు నిబంధనలను సడలించిన వేళ, కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడావో, తన కుమారుడిని తీసుకుని ఐస్ క్రీమ్ తినేందుకు వెళ్లాడు. క్యూబెక్ ప్రావిన్స్ లో సెయింట్-జీన్ బాప్టిస్ట్ దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ, మాస్క్ లను ధరించిన కెనడా నేత, తన ఆరేళ్ల కుమారుడు హడ్రియన్ తో కలిసి, గాటిన్యూలోని 'చాకొలెట్ ఫేవర్స్'కు వెళ్లారు.
అక్కడ హడ్రియన్ వెనీలా ఐస్ క్రీమ్ ను కుకీ టాపింగ్ తో తీసుకోగా, ట్రుడావో తనకోసం వెనీలాను చాకొలెట్ లో ముంచి తీసుకున్నారు. ఇద్దరూ కలిసి బయటకు వచ్చి, తమ మాస్క్ లను తీసేసి ఐస్ క్రీమ్ కోన్ లను తింటూ కనిపించారని స్థానిక మీడియా వెల్లడించింది.
కాగా, కెనడాలో మార్చి మూడో వారం నుంచి లాక్ డౌన్ అమలులోకి వచ్చింది. అత్యవసర, నిత్యావసర వ్యాపార సముదాయాలు మినహా మిగతా వన్నీ మూసేశారు. ఇప్పుడు నిబంధనలను ఎత్తివేయడంతో, ప్రజలంతా తమతమ కార్యకలాపాల్లో నిమగ్నమయ్యారు.