Pakistan: వారం రోజుల్లో సగం మంది ఉద్యోగులు వెనక్కి వెళ్లిపోవాలి: పాక్ హై కమిషన్ కు భారత్ ఆదేశం
- గూఢచర్యానికి పాల్పడుతున్న పాక్ ఉద్యోగులు
- ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కూడా
- పదేపదే ఒప్పందాల ఉల్లంఘనలు
- ఇస్లామాబాద్ నుంచి కూడా ఉద్యోగులను తగ్గిస్తున్నాం
- వెల్లడించిన భారత విదేశాంగ శాఖ
న్యూఢిల్లీలోని పాకిస్థాన్ రాయబార కార్యాలయంలో పనిచేస్తున్న పాకిస్థాన్ ఉద్యోగుల్లో సగం మందిని వెనక్కు పంపించాలని భారత్ కోరింది. ఇదే సమయంలో ఇస్లామాబాద్ లోని తమ రాయబార కార్యాలయం నుంచి కూడా సగం మందిని తగ్గించనున్నామని విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇరు దేశాల మధ్యా ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినే పరిస్థితులు నెలకొన్న ఈ తరుణంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. పాక్ హై కమిషన్ కార్యాలయంలోని సగం మందిని వారం రోజుల్లోగా తొలగించాలని విదేశాంగ శాఖ ఆదేశించింది.
పాకిస్థాన్ హై కమిషన్ ఉద్యోగులు గూఢచర్యానికి పాల్పడుతున్నారని, ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు పెట్టుకుంటున్నారని పదేపదే ఆరోపణలు చేస్తున్నా, హై కమిషన్ తీరు మారడం లేదని వెల్లడించిన విదేశాంగ శాఖ, అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. వియన్నా ఒప్పందానికి పాకిస్థాన్ కట్టుబడటం లేదని, రెండు దేశాల మధ్యా కుదిరిన ఒప్పందాలను పదేపదే ఉల్లంఘిస్తోందని, ఉద్యోగులు సీమాంతర ఉగ్రవాదాన్ని, హింసను ప్రోత్సహిస్తున్నారని ప్రభుత్వ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఇటీవలే ఇద్దరు పాక్ ఉద్యోగులు గూఢచర్యానికి పాల్పడుతూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారని, వారిని మే 31న దేశం నుంచి బహిష్కరించామని గుర్తు చేశారు.
గత వారం ఇస్లామాబాద్ లోని ఇద్దరు భారత హై కమిషన్ అధికారులు అదృశ్యమైన సంగతి తెలిసిందే. ఆపై వెంటనే భారత్ తీవ్రంగా స్పందించి, అభ్యంతరాలు వ్యక్తం చేయగా, వారిని తిరిగి వదిలేశారు. వీరికి గాయాలు అయ్యాయి. ఐఎస్ఐ వీరిని నిర్బంధంలోకి తీసుకుని హింసించినట్టు తెలుస్తుండగా, వీరిద్దరూ ఓ రోడ్ యాక్సిడెంట్ చేశారని, దీంతో పోలీసులు అదుపులోకి తీసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేసి, స్టేట్ మెంట్ తీసుకుని వదిలేశారని పాక్ అధికారులు వెల్లడించారు. ఆపై ఇద్దరూ జూన్ 22న ఇండియాకు చేరుకున్నారు. ఆపై వీరు తాము ఎదుర్కొన్న చిత్రహింసలను విదేశాంగ శాఖకు వెల్లడించగా, ఆ వెంటనే ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకోవడం గమనార్హం.