Sujana Chowdary: నిమ్మగడ్డ రమేశ్ ను కలవడంపై సుజనా చౌదరి వివరణ
- లాక్ డౌన్ సమయంలో నా ఆఫీస్ ను పార్క్ హయత్ కు మార్చాను
- నిమ్మగడ్డ, కామినేనిని కలవడంలో తప్పేముంది?
- వైసీపీ బురద చల్లే రాజకీయాలు చేస్తోంది
రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేశ్ తో భేటీపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి వివరణ ఇచ్చారు. నిమ్మగడ్డతో తాను ఎలాంటి రహస్య సమావేశాలను జరపలేదని ఆయన తెలిపారు. తనను కలవడానికి బీజేపీ నేత కామినేని శ్రీనివాస్ అపాయింట్ మెంట్ తీసుకున్నారని చెప్పారు. అదే రోజున నిమ్మగడ్డ రమేశ్ కూడా తనను కలవాలని అడిగారని తెలిపారు.
లాక్ డౌన్ సమయంలో తన కార్పొరేట్ కార్యాలయాన్ని హోటల్ పార్క్ హయత్ కు మార్చానని... దీంతో, తనను కలిసేందుకు వీరిద్దరూ అక్కడికే వచ్చారని చెప్పారు. వీరిద్దరూ తనతో విడివిడిగా సమావేశమయ్యారని తెలిపారు. ఇదేమీ చట్ట విరుద్ధమైన చర్య కాదని అన్నారు. ఈ మేరకు ఆయన ప్రెస్ నోట్ ద్వారా తెలియజేశారు.
కామినేని శ్రీనివాస్ తన పార్టీకే చెందిన నేత అని... నిమ్మగడ్డ తన కుటుంబానికి దగ్గర వ్యక్తి అని సుజనా చెప్పారు. వీరిద్దరూ తనను కలవడంలో తప్పేముందని ప్రశ్నించారు. నిమ్మగడ్డతో సమావేశంలో ఆయనను ఎస్ఈసీగా తొలగించిన అంశంపై చర్చించలేదని చెప్పారు. తానేదో కుట్ర రాజకీయాలకు తెరలేపానంటూ వైసీపీ నేతలు బురద చల్లే రాజకీయాలను చేస్తున్నారని... వీటిని తాను పట్టించుకోనని అన్నారు. తాను అలాంటి రాజకీయాలు చేయలేనని చెప్పారు.