: ఆమె స్థైర్యం ముందు ఎవరెస్ట్ చిన్నబోయింది!
అరుణిమ సిన్హా (25).. ఈ పేరు గుర్తుందా..!? రెండేళ్ళ క్రితం లక్నో నుంచి ఢిల్లీ రైల్లో ప్రయాణిస్తున్న ఈ వాలీబాల్ క్రీడాకారిణిని కొందరు దుండగులు రైల్లోంచి కిందికి నెట్టివేయగా.. మరో రైలు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడింది. ఆ ప్రమాదంలో ఆమె ఎడమకాలిని కోల్పోయింది. అయితే, ఆ వైకల్యం ఆమెను కుంగదీయలేకపోయింది. విధి ఆమె కాలిని బలి తీసుకోగలిందేమోగానీ, ఆత్మస్థైర్యాన్ని మాత్రం అణుమాత్రం కదిలించలేకపోయింది. చెక్కుచెదరని గుండెనిబ్బరంతో మళ్ళీ జీవనపోరాటం ఆరంభించిన ఈ ఉత్తర్ ప్రదేశ్ అమ్మాయి ఇప్పుడు చరిత్ర సృష్టించింది. కృత్రిమకాలుతో ఏకంగా ఎవరెస్ట్ ను అధిరోహించి పట్టుదల ఉంటే ఏదీ అసాధ్యం కాదని నిరూపించింది. ముఖ్యంగా తనలాంటి వికలాంగులకు స్ఫూర్తిగా నిలిచింది.
ఈ సమున్నత పర్వత శిఖరాగ్రం చేరిన తొలి భారతీయ వికలాంగ మహిళా రికార్డు పుటల్లోకెక్కిన అరుణిమ ఏమంటుందో వినండి. రైలు ప్రమాదం జరిగిన తర్వాత అందరూ తనవైపు సానుభూతితో చూడడాన్ని భరించలేకపోయానంది. అదే తనలో కసిని పెంచి ఎవరెస్ట్ ఎక్కేలా పురిగొల్పిందని వివరించింది.