exams: ఏపీలో పది పరీక్షలు రద్దు.. ఇంటర్ ఫెయిలయిన వారు కూడా పాస్: మంత్రి ఆదిమూలపు సురేశ్ అధికారిక ప్రకటన
- ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి ఉద్ధృతి నేపథ్యంలో నిర్ణయం
- విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్ణయమన్న సురేశ్
- ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రద్దు చేస్తున్నామని ప్రకటన
- ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి ఉద్ధృతంగా ఉండడంతో పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పరీక్షలను రద్దు చేస్తున్నామని ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటన చేశారు.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలు పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల నిర్వహణపై ఉన్నతాధికారులతో మంత్రి ఆదిమూలపు సురేశ్ చర్చించి ఈ కీలక నిర్ణయంపై ప్రకటన చేశారు.
'మార్కులు, గ్రేడింగ్‌కు విధివిధానాలు రూపొందించాలని ఆదేశించాం. పదో తరగతి పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేస్తున్నాం. భవిష్యత్తులో కరోనా కేసులు పెరుగుతాయని సర్వేలు చెబుతున్నాయి. అలాగే ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు కూడా రద్దు చేస్తున్నాం. ఇంటర్ ప్రథమ, ద్వితీయ ఏడాది ఫెయిలయిన వారు కూడా పాస్ అయినట్లే' అని మంత్రి చెప్పారు.