Sonu Nigam: త్వరలో మ్యూజిక్ ఇండస్ట్రీలో ఆత్మహత్యలు మొదలవుతాయి: సోనూ నిగమ్ సంచలన వ్యాఖ్యలు
- సినీ రంగం కంటే పెద్ద మాఫియా ఇక్కడ ఉంది
- ఎవరు పాడాలో ఆ రెండు కంపెనీలే నిర్ణయిస్తాయి
- బాలీవుడ్‌లో కలకలం రేపుతున్న సోనూ వ్యాఖ్యలు
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత సినీ రంగంలోని ఆధిపత్య ధోరణిపై ఇంటాబయట తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నైపుణ్యం ఉన్నప్పటికీ అవకాశాలు ఇవ్వకుండా మానసికంగా వేధించడం, స్టార్ కిడ్స్‌కే అవకాశాలు ఇస్తుండడంపై విమర్శల జడివాన కురుస్తున్న వేళ బాలీవుడ్‌కే చెందిన ప్రముఖ గాయకుడు సోనూ నిగమ్ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో మరోమారు కలకలం రేపాయి. త్వరలో సంగీత ప్రపంచంలోనూ ఆత్మహత్యలు చూస్తారని సోనూ పేర్కొన్నాడు.
ఈ రంగంలోనూ గుత్తాధిపత్యం రాజ్యమేలుతోందని, రెండు కంపెనీలు ఆడిందే ఆట, పాడిందే పాటగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించాడు. ఎవరు పాడాలో కూడా ఆ రెండు కంపెనీలే నిర్ణయిస్తాయన్నాడు. సినీ రంగం కంటే ఇక్కడ పెద్ద మాఫియాలు ఉన్నాయంటూ సోనూ నిగమ్ చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్‌లో ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.