UNO: భారత్ కు మద్దతు తెలిపిన 184 దేశాలకు మోదీ కృతజ్ఞతలు!
- ఐరాసలో ఇండియాకు ఓటేసిన 184 దేశాలు
- రెండేళ్ల పాటు తాత్కాలిక సభ్య దేశంగా ఇండియా
- ఇతర దేశాలతో కలిసి పనిచేస్తామన్న మోదీ
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తాత్కాలిక సభ్యత్వ ఎన్నికల్లో ఇండియాకు మద్దతుగా నిలిచిన దేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. నిన్న రాత్రి జరిగిన ఎన్నికల్లో 192 దేశాల ఓట్లు పోల్ కాగా, ఇండియాకు 184 ఓట్లు దక్కాయి. దాదాపు ఏకగ్రీవంగా ఇండియా ఈ ఎన్నికల్లో గెలిచినట్లయింది. ఈ విజయం ఇండియాకు గొప్ప పరిణామమని మోదీ అభివర్ణించారు.
ఈ మేరకు తన సోషల్ మీడియా వేదికగా, ఇండియాకు మద్దతిచ్చిన దేశాలకు ఆయన ధ్యాంక్స్ చెప్పారు. పోటీ లేకుండా ఇండియాను గెలిపించారని అన్నారు. తమ దేశానికి దక్కిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని, సహచర సభ్య దేశాలతో కలిసి పని చేస్తామని అన్నారు. ప్రపంచంలో శాంతిని నెలకొల్పడం, సామరస్యం, భద్రత, సమానత్వం తదితర హక్కుల కోసం తమ పంథాను కొనసాగిస్తామని అన్నారు. కాగా, ఈ ఎన్నికల్లో గెలిచిన భారత్, 2021-22 సంవత్సరాల్లో తాత్కాలిక సభ్యత్వ దేశంగా కొనసాగనుందన్న సంగతి తెలిసిందే.