Ramcharan: రామ్ చరణ్ ను పరిచయం చేయడానికి భయపడ్డాను: రాజమౌళి వెల్లడించిన ఆసక్తికర విషయం!
- చిరంజీవి నుంచి వచ్చిన ఆఫర్
- చెర్రీలోని ప్లస్ లు, మైనస్ లు తెలియవు
- అందుకే చేయలేనని చెప్పానన్న రాజమౌళి
స్టార్ హీరోల వారసులను వెండితెరకు పరిచయం చేసే అవకాశాలు అతి కొద్ది మంది దర్శకులకు మాత్రమే అందుతుంటాయి. ఎన్నో కాలిక్యులేషన్స్ తర్వాత దర్శకులను ఎంచుకుంటూ వుంటారు. ఈ క్రమంలో, మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ ను హీరోగా పరిచయం చేసే అవకాశం తొలుత రాజమౌళి వద్దకే వచ్చిందట. అయితే, చరణ్ తొలి సినిమాకు దర్శకత్వం వహించడానికి తాను భయపడ్డానని రాజమౌళే స్వయంగా వెల్లడించారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన చెబుతూ, చరణ్ ను పరిచయం చేయాలని చిరంజీవి నుంచి తొలి ఆఫర్ తనకే వచ్చిందని, అయితే తాను చేయలేనని చెప్పేశానని రాజమౌళి గుర్తుచేసుకున్నారు. రామ్ చరణ్ లోని ప్లస్, మైనస్ లు తనకు తెలియకపోవడమే ఇందుకు కారణమని అన్నారు. ఫైట్స్ ఎలా చేస్తాడో తనకు తెలియదని, డ్యాన్స్, ఎమోషన్స్ విషయంలో కూడా అవగాహన లేదని చెప్పుకొచ్చారు.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే, చిరంజీవి కుమారుడు కావడం, అభిమానుల్లో ఉండే భారీ అంచనాలను మనసులో పెట్టుకుని, తాను ఆ ఆఫర్ ను వదిలేసుకున్నానని తెలిపారు. కాగా, ఆ తరువాత పూరీ జగన్నాథ్ రంగంలోకి దిగి, చెర్రీ తొలి చిత్రం 'చిరుత'కు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. దాని తరువాత రామ్ చరణ్ తో రాజమౌళి 'మగధీర' వంటి బంపర్ హిట్ ను తీశారు.