Doctors: నవంబరులోనే అసాధారణ లక్షణాలతో రోగుల రాకను గుర్తించిన భారత వైద్యులు
- చైనాలో నవంబరులో బయటపడిన కరోనా మహమ్మారి
- ఆపై ప్రపంచదేశాలకు వ్యాప్తి
- భారత్ లో జనవరి చివరి వారం నుంచి కరోనా వ్యాప్తి
ప్రపంచంలోని దేశాలన్నింటిని హడలెత్తిస్తున్న కరోనా వైరస్ ఎప్పుడు బయటపడిందన్న దానిపై భిన్న వాదనలు ఉన్నాయి. చైనాలోని వుహాన్ లో డిసెంబరులో కరోనా ప్రభావం మొదలైందని చెబుతున్నా, గత ఆగస్టులోనే అక్కడ ఆసుపత్రుల్లో రద్దీ పెరిగిందని కొన్ని వార్తలు వచ్చాయి. ఇక భారత్ లో జనవరి 30న తొలి కేసు కేరళలో నమోదైందని చెబుతుండగా, వైద్యులు వెల్లడిస్తున్న అంశాలు మరింత ఆసక్తి కలిగిస్తున్నాయి. నవంబరులో కొంతమంది రోగులు అసాధారణ లక్షణాలతో ఆసుపత్రులకు రావడం గమనించామని కొందరు వైద్యులు తెలిపారు. రోగుల్లో అలాంటి లక్షణాలను ఎప్పుడూ గమనించలేదని, భారత్ లో అధికారికంగా కరోనా కేసులు నమోదైన సమయం కంటే ముందే ఈ తరహా కేసులను తాము చూశామని సీనియర్ ఈఎన్ టీ స్పెషలిస్ట్ జగదీశ్ చతుర్వేది తెలిపారు.
తమ వద్దకు వచ్చిన రోగుల్లో ప్రతి ఇద్దరిలో ఒకరు వారాల తరబడి తీవ్రమైన గొంతు నొప్పి, పొడి దగ్గుతో బాధపడ్డారని, జ్వరం, నిస్సత్తువ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారని వివరించారు. 2019 నవంబరు చివరి వారం నుంచి 2020 జనవరి చివరి వారం వరకు భారత్ లో కరోనాపై చైతన్యం లేదని, ఆ సమయంలో తాము శ్వాస వ్యవస్థ ఊర్థ్వభాగాన్ని దెబ్బతీస్తున్న వైరస్ ఇన్ఫెక్షన్ ను అనేకమంది రోగుల్లో గుర్తించామని తెలిపారు.