Containment Zone: బెంగళూరులో కంటెయిన్ మెంట్ జోన్లు ఇక కనిపించవు!

No Containment Zones in Bengalore

  • వైరస్ సోకిన ఇల్లు మాత్రమే సీల్
  • నేడో రేపో అధికారిక నిర్ణయం
  • వెల్లడించిన బీబీఎంపీ కమిషనర్

కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నా, ఇకపై కొత్త కేసులు వచ్చే ప్రాంతాలను కంటెయిన్ మెంట్ జోన్లుగా ప్రకటించరాదని బీబీఎంపీ (బృహత్ బెంగళూరు మహానగర పాలికే) కీలక నిర్ణయం తీసుకుంది. ఓ వార్డును కంటెయిన్ జోన్ గా ప్రకటించే బదులు, వ్యాధి సోకిన వ్యక్తి నివాసం ఉన్న ఇల్లు లేదా అపార్టుమెంట్ ను సీల్ వేయాలని నిర్ణయించినట్టు అధికారులు వెల్లడించారు. ఈ విషయంలో నేడో, రేపో అధికారిక ఉత్తర్వులు జారీ చేయనున్నామని బీబీఎంపీ అధికారులు వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం అమలు చేస్తున్న విధి విధానాల్లో భాగంగా, కొత్త కేసు వచ్చిన ప్రాంతంలోని వార్డునంతా కంటెయిన్ మెంట్ జోన్ గా ప్రకటిస్తున్నారు. ఈ నిబంధనలను సడలించాలని నిర్ణయించామని అధికారులు తెలిపారు. కొవిడ్-19 వార్ రూమ్ బులెటిన్ లోని వివరాల ప్రకారం, నగరంలో 198 వార్డులుండగా, 116 వార్డుల్లో కేసులు ఉన్నాయి. ఇవన్నీ ప్రస్తుతం జోన్ల పరిధిలో ఉండగా, ఇకపై 126 వీధులు, 19 అపార్టుమెంట్ కాంప్లెక్స్ లు మాత్రమే కంటెయిన్ చేయాలన్నది అధికారుల యోచనగా తెలుస్తోంది.

కరోనా రోగి నివాసం ఉన్న ఇంటిని మాత్రమే కంటెయిన్ చేస్తామని, ఆ వీధిని, చుట్టుపక్కల ఇళ్లను వదిలివేయనున్నామని బీబీఎంపీ కమిషనర్ బీహెచ్ అనిల్ కుమార్ వెల్లడించారు. ముంబయి, చెన్నై తరహా వైరస్ వ్యాప్తి పరిస్థితులు బెంగళూరులో లేవని ఆయన అన్నారు. ఒక పాజిటివ్ కేసు వచ్చిందని, మొత్తం ప్రాంతాన్ని 28 రోజుల పాటు మూసివేయడం తగదన్న నిర్ణయానికి వచ్చామని ఆయన అన్నారు. కేసుల సంఖ్య అధికంగా ఉన్న పాదరాయనణపుర, ఎస్కే గార్డెన్, మంగమ్మణ్ పాల్య ప్రాంతాల్లో పరిస్థితి అదుపులోకి వచ్చిందని తెలిపారు.

  • Loading...

More Telugu News