Chandrababu: తెలుగుదేశం నేతలను ఇలా అక్రమంగా కేసులు పెట్టి అరెస్టులతో బెదిరిస్తున్నారు: చంద్రబాబు ఆగ్రహం

chandrababu condemns tdp leaders arrest

  • అవినీతిపరుడికి అధికారం వస్తే ఇన్ని అనర్థాలు
  • ప్రత్యర్థులపై కక్ష సాధించడం అన్నది ఫ్యాక్షనిస్టుల స్వభావం
  • ఇప్పుడు ఈ జగన్ చేస్తున్నది ఇదే
  • అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం

టీడీపీ నేతల అరెస్టులపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేశ్ మండిపడ్డారు. 'ఒక అవినీతిపరుడు, ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న నేర స్వభావి చేతికి అధికారం వస్తే ఎలాంటి అనర్థాలు జరుగుతాయో అవన్నీ ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నాయి. ప్రత్యర్థులపై కక్ష సాధించడం అన్నది ఫ్యాక్షనిస్టుల స్వభావం. ఇప్పుడు ఈ జగన్ చేస్తున్నది ఇదే' అని చంద్రబాబు అన్నారు.  

'నిన్న బీసీ నేత అచ్చెన్నాయుడు ఇంటి గోడలుదూకి మరీ వెళ్ళిన పోలీసులు ఆయన్ను అరెస్టు చేసారు. ఈ రోజు జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిలను అరెస్టు చేశారు. ప్రలోభాలకు లొంగని తెలుగుదేశం నేతలను ఇలా అక్రమంగా కేసులు పెట్టి అరెస్టులతో బెదిరిస్తున్నారు' అని మండిపడ్డారు  

'ఈ అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం. పరిపాలనలో ఘోరంగా విఫలమై ప్రజల దృష్టిని మరల్చడానికి పాలకులు చేస్తున్న అరాచకాలను అందరూ అడ్డుకోవాలి. లేదంటే ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదం' అని చంద్రబాబు అన్నారు.

'బీసీ నేత అచ్చెన్నాయుడు గారి అక్రమ అరెస్ట్ ని పక్కదారి పట్టించేందుకే ఈ రోజు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, అస్మిత్ రెడ్డిలను అరెస్ట్ చేశారు. 16 నెలల జైలు పక్షి, లక్ష కోట్ల రూపాయల దోపిడీదారు, 11 కేసుల్లో ఏ1 జగన్ రెడ్డి, టీడీపీ నాయకుల్ని జైల్లో పెట్టి రాక్షస ఆనందం పొందాలనుకుంటున్నాడు' అని లోకేశ్ అన్నారు.  

'ఏడాది పాలనలో జగన్  ఒక చేతగాని ముఖ్యమంత్రి అనే విషయం ప్రజలకు అర్థమైంది. ఆయనను అభద్రతా భావం వెంటాడుతోంది. అందుకే రాజారెడ్డి రాజ్యాంగంలో వేధింపుల పర్వానికి తెరలేపారు. ప్రలోభాలకు లొంగితే వైకాపా కండువా.. లొంగకపోతే జైలు' అని ఆరోపించారు.

'ప్రతిపక్ష నేతలపై వేధింపులు, కక్ష తీర్చుకోవడానికే జగన్ ముఖ్యమంత్రి అయినట్టు ఉంది. సమర్థవంతంగా జగన్ గవర్నమెంట్ 'టెర్రరిజాన్ని' ఎదుర్కొంటాం. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు,అస్మిత్ రెడ్డి ల అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నాను' అని చెప్పారు.

  • Loading...

More Telugu News