GST: లాక్ డౌన్ నేపథ్యంలో వడ్డీ సగానికి సగం తగ్గిస్తూ చిన్న వ్యాపారులకు కేంద్రం ఊరట
- నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో జీఎస్టీ మండలి భేటీ
- రిటర్న్ ల దాఖలు ఆలస్యమైతే చెల్లించాల్సిన వడ్డీ తగ్గింపు
- 18 శాతం నుంచి 9 శాతానికి తగ్గింపు
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో జీఎస్టీ మండలి సమావేశం అయింది. ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రిటర్న్ ల దాఖలు ఆలస్యమైతే చెల్లించాల్సిన వడ్డీ సగానికి తగ్గిస్తూ జీఎస్టీ మండలి చిన్న వ్యాపారులకు ఊరట కలిగించింది. దీనిపై నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, వడ్డీని 18 నుంచి 9 శాతానికి తగ్గించాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఈ నిర్ణయం రూ.5 కోట్ల వరకు టర్నోవర్ గల వ్యాపార సంస్థలకు వర్తిస్తుందని వివరించారు. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ మాసాలకు ఈ తగ్గింపు వర్తిస్తుందని వెల్లడించారు. మే రిటర్న్ ల దాఖలు గడువు ఎలాంటి అపరాధ రుసుం, వడ్డీ లేకుండా సెప్టెంబరు వరకు పొడిగిస్తున్నట్టు తెలిపారు.
అయితే, 2017 జూలై నుంచి 2020 జనవరి మధ్య రిటర్న్ లు చెల్లించకుంటే మాత్రం అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుందని నిర్మల స్పష్టం చేశారు. అపరాధ రుసుం గరిష్టంగా రూ.500 వరకు పరిమితం చేసినట్టు పేర్కొన్నారు. ఇక, పాన్ మసాలాపై పన్ను అంశంపై తదుపరి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.