CBI: చంద్రన్న కానుకపై సీబీఐ విచారణ... ఏపీ క్యాబినెట్ నిర్ణయం
- ఏపీ క్యాబినెట్ లో కీలక నిర్ణయాలు
- చంద్రబాబు హయాంలో అక్రమాలు జరిగాయన్న మంత్రి పేర్ని నాని
- అవినీతిపై సీబీఐ విచారణ జరుగుతుంది
ఇవాళ జరిగిన ఏపీ క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీనిపై మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో అక్రమాలు జరిగాయని, దీనిపై ప్రశ్నిస్తుంటే దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి అంటూ సవాళ్లు విసురుతున్నారని విపక్ష టీడీపీపై విమర్శలు చేశారు. గత అక్రమాలపై తాము సిట్ వేస్తే పారిపోతున్నారని, కక్ష సాధింపులంటూ ఆరోపణలు చేస్తున్నారని వెల్లడించారు. అయితే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని, ఒక్కొక్కరుగా అరెస్ట్ అవుతున్నారని వివరించారు.
ఈ క్రమంలో, చంద్రన్న సంక్రాంతి, రంజాన్ తోఫా, క్రిస్మస్ తోఫా వంటి పథకాలపై ఇప్పటికే క్యాబినెట్ సబ్ కమిటీ విచారణ జరిపిందని, టెండర్లు, కొనుగోళ్లలో సాధారణ నియమాలకు వ్యతిరేకంగా ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుని రూ.150 కోట్లకు పైగా అవినీతి జరిగినట్టు సబ్ కమిటీ గుర్తించిందని వెల్లడించారు.
అంతేకాకుండా, ప్రజలను సాంకేతిక పరిజ్ఞానానికి మరింత దగ్గర చేసేందుకు కేంద్రం ఫైబర్ నెట్ తీసుకువస్తే, దాన్ని ఏపీ ఫైబర్ నెట్ పేరిట అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న వేమూరి హరికృష్ణ అనే వ్యక్తికి యాజమాన్య బాధ్యతలు అప్పగించారని మంత్రి పేర్ని నాని ఆరోపించారు. సెట్ టాప్ బాక్సుల కొనుగోళ్లలోనూ అక్రమాలు జరిగాయని అన్నారు. ఇందులో 200 కోట్ల రూపాయల మేర అవినీతి జరిగిందని గుర్తించినట్టు తెలిపారు. చంద్రబాబు ప్రతి దానికి సీబీఐ ఎంక్వైరీ అంటుంటారని, ఇప్పుడు సీబీఐ నేరుగా వాళ్లవద్దకే వస్తుందని, అన్ని లెక్కలు సిద్ధం చేసుకోవాలంటూ హెచ్చరించారు.