Gandhi Hospital: కరోనా సోకిన జర్నలిస్టుల కోసం గాంధీ ఆసుపత్రిలో మనోజ్ పేరిట ప్రత్యేక వార్డు!

Corona Special Ward for Journalists in Gandhi Hospital

  • కరోనాపై ఫ్రంట్ లైన్ వారియర్స్ లో జర్నలిస్టులు కూడా
  • సరైన సమయంలో చికిత్స లభించక మనోజ్ మృతి
  • తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో అధికారుల చర్యలు

నిత్యమూ కరోనా మహమ్మారిని అణచివేసేందుకు పోరాడుతున్న వారిలో జర్నలిస్టులు కూడా ఉన్నారన్న సంగతి అందరికీ తెలిసిందే. రోజూ తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్న వైద్యులు, ఆరోగ్య సిబ్బందితో పాటు పలువురు జర్నలిస్టులు కూడా వైరస్ బారిన పడ్డారు. వీరిలో హైదరాబాదుకు చెందిన మనోజ్ అనే జర్నలిస్ట్ కు సకాలంలో చికిత్స అందక మరణించాడన్న విమర్శలు వెల్లువెత్తడంతో, తెలంగాణ రాష్ట్ర అధికారులు స్పందించారు.

కంటెయిన్ మెంట్ జోన్లలో నిత్యమూ తిరుగుతూ, కరోనా వ్యాప్తిపై వార్తలను అందిస్తున్న హైదరాబాద్ జర్నలిస్టుల్లో దాదాపు 16 మందికి వ్యాధి సోకింది. వీరిలో మనోజ్ పరిస్థితి విషమించి మరణించగా, గాంధీ ఆసుపత్రిలోని ఆరో అంతస్తులో మనోజ్ పేరిట ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసి, వ్యాధి సోకిన విలేకరులకు, మీడియా వారికి చికిత్సలను అందించాలని అధికారులు నిర్ణయించారు.

డాక్టర్లు, పోలీసులకు ఇప్పటికే ప్రత్యేక వార్డులు ఉండగా, ఇకపై జర్నలిస్టులకు కూడా స్పెషల్ వార్డు అందుబాటులోకి వచ్చింది. మనోజ్ తో పాటు పనిచేసిన సెక్రటేరియేట్ బీట్ ను చూసే ఇతర మీడియా వారందరికీ కరోనా పరీక్షలను చేయాలని నిర్ణయించిన అధికారులు, వారి నమూనాలను ఇప్పటికే సేకరించారు. ఎవరికైనా వైరస్ సోకినట్టు తేలితే, ఈ ప్రత్యేక వార్డులోనే చికిత్సను అందిస్తామని అధికారులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News