Check Bounce: చెక్ బౌన్స్ ఇక క్రిమినల్ కేసు కాదు...చట్టాల్లో సవరణలకు కేంద్రం ప్రతిపాదన!

Center Act Change on Check Bounce Offence is De Criminalise

  • పలు చట్టాలను సవరించనున్న కేంద్రం
  • 23 వరకూ అభిప్రాయాలు తెలిపే అవకాశం
  • ప్రకటన వెలువరించిన ఆర్థిక శాఖ

చిన్న చిన్న ఆర్థిక ఉల్లంఘనలను డీ క్రిమినలైజేషన్ చేయాలన్న ఉద్దేశంలో భాగంగా 19 చట్టాల్లో సవరణలు చేయాలని కేంద్రం ప్రతిపాదించింది. ఇందులో బ్యాంకు ఖాతాలో సరిపడినంత నగదు లేకుండా ఇచ్చే చెక్ లు బౌన్స్ అయితే, అది క్రిమినల్ కేసుగా పరిగణించరాదని కూడా ఉంది. ఇదే సమయంలో రుణాల చెల్లింపు నిబంధనలను పాటించని వారిపైనా నేరపూరిత అభియోగాలను నమోదు చేయరాదని కేంద్రం పేర్కొంది.

ఈ మేరకు మొత్తం 19 చట్టాల్లో సవరణలు ప్రతిపాదించిన కేంద్రం, జూన్ 23 వరకూ అభిప్రాయాలను సేకరించాలని నిర్ణయించింది. దీనిలో ప్రస్తుతం నిర్దిష్ట సెక్షన్ల పరిధిలో ఉన్న ఏ నేరాలను క్రిమినల్ నేరాలుగా పరిగణించ వచ్చని, వేటిని తొలగించాలన్న వివరాలున్నాయి. చిన్న చిన్న నేరాలను డీ క్రిమినలైజ్ చేయడం ద్వారా సులభతర వ్యాపార పరిస్థితులను కల్పించ వచ్చన్నది కేంద్రం అభిమతం.

ఇక ఈ విషయాన్ని వెల్లడించిన ఆర్థిక శాఖ, వివిధ వర్గాలు ఈ చట్ట సవరణలపై తమకున్న అభిప్రాయాలను, సూచనలను తెలియజేయాలని ఓ ప్రకటనలో కోరింది. ప్రస్తుతం నెగోషియబుల్ ఇన్ స్ట్రమెంట్స్ యాక్ట్ 1881 ప్రకారం, చెక్ బౌన్స్ కేసులో రెండేళ్ల వరకూ జైలుశిక్ష లేదా చెక్ మొత్తానికి రెట్టింపు జరిమానా విధించే అవకాశం ఉందన్న సంగతి తెలిసిందే. కొత్త ప్రతిపాదనల్లో దాన్ని సవరించే ప్రతిపాదనలు ఉన్నాయి.

చెక్ బౌన్స్ చట్టాలతో పాటు సర్ఫేసీ (బ్యాంకు రుణాల చెల్లింపు ఉల్లంఘనలు), ఎల్ఐసీ, పీఎఫ్ఆర్డీఏ, ఆర్బీఐ చట్టాలు, బ్యాంకింగ్ నియంత్రణ, చిట్ ఫండ్స్, జనరల్ ఇన్స్యూరెన్స్ బిజినెస్, నియంత్రణలో లేని డిపాజిట్ స్కీముల నియంత్రణ, పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్ చట్టం, ఫ్యాక్టరింగ్ నియంత్రణ, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీల నియంత్రణ, స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ చట్టాలను కూడా సవరించాలని కేంద్రం ప్రతిపాదించింది.

  • Loading...

More Telugu News