Tirumala: తెరచుకున్న శ్రీహరివాసము... ఆన్ లైన్ లో టికెట్లు... కేవలం మహాలఘు దర్శనమే!

Tirumala Temple Opens Today

  • నేటి నుంచి మూడు రోజుల ట్రయల్ రన్
  • 11 నుంచి సాధారణ భక్తులకు అనుమతి
  • అన్ని రకాల ఏర్పాట్లు చేసిన టీటీడీ
  • వృద్ధులకు, పిల్లలకు మాత్రం లభించని అనుమతి
  • రోజుకు 6 వేల మందికే వెంకన్న దర్శనం

కోట్లాది మంది కొంగు బంగారమైన తిరుమల శ్రీ వెంకటేశ్వరుని దేవాలయం ఈ ఉదయం తెరచుకుంది. నేటి నుంచి రూ. 300 దర్శన టికెట్లను భక్తులకు ఆన్ లైన్ లో అందుబాటులోకి తెచ్చింది టీటీడీ. నేటి నుంచి మూడు రోజుల పాటు ఉద్యోగులు, స్థానికులతో ట్రయల్ రన్ నిర్వహించిన తరువాత, 11 నుంచి సాధారణ భక్తులు స్వామిని దర్శించుకోవచ్చు. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని మార్చి 3వ వారంలో ఆలయంలో దర్శనాలను నిలిపివేసిన సంగతి తెలిసిందే.

ఆపై గత వారంలో ఆలయాలు తెరిచేందుకు కేంద్రం అనుమతించిన తరువాత టీటీడీ సైతం భౌతిక దూరం, శానిటైజేషన్ వంటి ఏర్పాట్లు చేసింది. నేటి నుంచి రోజుకు ఆరు వేల మంది చొప్పున మూడు రోజుల పాటు దర్శనాల ట్రయల్ రన్ జరుగనుంది. 11 నుంచి ఇతర ప్రాంతాల భక్తులకు దర్శనం లభించనుంది.

ఇక జూన్ నెల ప్రత్యేక దర్శనం టికెట్లను టీటీడీ ఈ ఉదయం వెబ్ సైట్ లో విడుదల చేయనుంది. చిన్న పిల్లలు, వృద్ధులకు దర్శనాలకు ఇంకా అనుమతి లభించలేదు. ఉదయం 6.30 నుంచి రాత్రి 7.30 వరకూ దర్శనాలకు అనుమతించనుండగా, జయ విజయుల వరకూ మాత్రమే... అంటే, మహా లఘు దర్శనాన్ని మాత్రమే చేయించాలని టీటీడీ నిర్ణయించింది.

ఇక వీఐపీలు స్వయంగా వస్తేనే అధికారులు దర్శనం చేయిస్తారు. 11 నుంచి ఆన్ లైన్ లో రోజుకు 3 వేలు, తిరుపతిలోని వివిధ కేంద్రాల్లో టైమ్ స్లాట్ టోకెన్లు పొందే మరో 3 వేల మందికి మాత్రమే దర్శనం ఉంటుంది.

ఇక అనారోగ్యాలకు గురైన వారు తిరుమలకు రావద్దని, వారిని నివారించేందుకు తిరుపతిలోని అలిపిరి వద్దే థర్మల్ స్క్రీనింగ్, వాహనాల శానిటైజేషన్ ఏర్పాటు చేశామని అధికారులు వెల్లడించారు. తిరుమలకు వచ్చే భక్తులు వారికి కేటాయించిన సమయంలోనే ఆలయంలోకి రావాలని, ఎవరినీ తాకకుండా ఆలయంలోకి వెళ్లాలని అధికారులు సూచించారు.

మంచి నీటి కొళాయిలను చేత్తో ఆపరేట్ చేయకుండా లెగ్ ఆపరేటింగ్ సిస్టమ్ ను టీటీడీ అందుబాటులోకి తెచ్చింది. స్వామిని దర్శించుకున్న భక్తులకు ఉచితంగా ఒక లడ్డూ ఇస్తామని, అదనంగా కావాలంటే, రూ. 50 చొప్పున కొనుగోలు చేయవచ్చని టీటీడీ అధికారులు ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News