Pawan Kalyan: కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు మధ్య తరగతికి ఆర్థిక భరోసా కల్పిస్తున్నాయి: పవన్ కల్యాణ్
- కరోనా మధ్యతరగతి ప్రజలపై బాగా ప్రభావం చూపిందన్న పవన్
- కేంద్రం నిర్ణయాలు చిరువ్యాపారులకు లాభిస్తాయని వెల్లడి
- మధ్య తరగతి ప్రయోజనాలు కాపాడుతున్నారంటూ ప్రశంసలు
కరోనా మహమ్మారి మధ్యతరగతి ప్రజలపైనా, వేతన జీవులపైనా విపరీతమైన ప్రభావం చూపిందని, అయితే ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, ఉపశమన చర్యలు మధ్యతరగతికి ఆర్థిక భరోసా ఇచ్చేలా ఉన్నాయని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. సొంత ఇంటి కోసం రుణాలు తీసుకునేవారికి వడ్డీ రాయితీని రూ.1.5 లక్షల మేర అదనంగా ఇస్తున్నారని, అందువల్ల గృహ రుణాలు తీసుకున్న వేతన జీవులకు, చిరు వ్యాపారాలు చేసుకునేవారికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని వివరించారు.
స్పెషల్ లిక్విడిటీ ఫెసిలిటీలో రూ.50 వేల కోట్లు కేటాయించడం వల్ల మ్యూచువల్ ఫండ్స్ లో కొద్దిమొత్తాలు పెట్టుబడిగా పెట్టిన చిరుద్యోగులు, చిన్న వ్యాపారులు నష్టపోకుండా ఉంటారని పవన్ తెలిపారు. అంతేగాకుండా, బోగస్ చిట్ ఫండ్ కంపెనీలను కట్టడి చేయడం వల్ల మధ్య తరగతి ప్రయోజనాలను కాపాడగలుగుతున్నారని పేర్కొన్నారు.
కరోనా ప్రభావంతో కుటుంబ బడ్జెట్ తల్లకిందులవుతున్న ప్రస్తుత తరుణంలో మధ్య తరగతి ప్రజలు ఆందోళన చెందకుండా బ్యాంకులు సులువుగా రుణాలు ఇచ్చేలా ఆ రంగానికి తగిన ఉద్దీపన చర్యలు ప్రకటించడం మంచి నిర్ణయం అని పవన్ కేంద్రాన్ని పొగిడారు.