New Delhi: పెరుగుతున్న కరోనా మృతులు... ఢిల్లీ శ్మశానం 24 గంటలూ తెరచివుంచాలని నిర్ణయం!

Nigambodh Ghat Open for All Day in Delhi

  • ఢిల్లీలోని అతిపెద్ద నిగంబోధ్ శ్మశానం 
  • రెండు నెలల వ్యవధిలో 500 మందికి అంత్యక్రియలు
  • దహన సంస్కారాలకు క్యూలైన్

సాధారణంగా సూర్యుడు అస్తమించే లోపు మూతబడే శ్మశానం ఇప్పుడు 24 గంటలూ తెరచి ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ స్థితి ఏర్పడింది ఎక్కడో కాదు. దేశ రాజధాని హస్తినలో అత్యంత పురాతన, అతిపెద్ద నిగంబోధ్ ఘాట్ లో. కరోనా మృతులు పెరిగిపోతున్న వేళ, నిగంబోధ్ ఘాట్ ను 24 గంటలూ తెరిచే ఉంచాలని అధికారులు నిర్ణయించారు. హాస్పిటల్స్ నుంచి వస్తున్న మృతదేహాలను దహనం చేసేందుకు తమకు తగినంత సమయం ఉండటం లేదని అక్కడి కాటికాపరులు వాపోతున్న వేళ, ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

న్యూఢిల్లీలోని ప్రఖ్యాత ఎర్రకోటను ఆనుకుని నిగంబోధ్ శ్మశానవాటిక ఉండగా, ఇక్కడ ఇప్పుడు తెల్లవారుతూనే మొదలవుతున్న దహన సంస్కారాలు, అర్థరాత్రి వరకూ కొనసాగుతూనే ఉన్నాయి. కరోనా కారణంగా న్యూఢిల్లీ పరిధిలో ఇప్పటివరకూ 650 మందికిపైగా మరణించారు. గడచిన రెండు నెలల్లో 500 మంది అంత్యక్రియలు ఇదే శ్మశానంలో జరిగాయి.

మృతుల దహన సంస్కారాల సందర్భంగా వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నామని, ఇందుకోసం వేగంగా కార్యక్రమాన్ని పూర్తి చేసే మోడ్రన్ ఫర్నేస్ లను వినియోగిస్తున్నామని అధికారులు వెల్లడించారు. ఇక ఇక్కడికి తమవారి దహన సంస్కారాల నిమిత్తం వస్తున్న వారు క్యూ లైన్లలో నిలబడాల్సి వస్తోందని క్రిమటోరియమ్ మేనేజ్ మెంట్ కమిటీ ప్రతినిధి సుమన్ కుమార్ గుప్తా వెల్లడించారు.

వచ్చిన వారందరినీ శానిటైజేషన్ టన్నెల్ గుండా పంపిస్తున్నామని, పరిశుభ్రతకు పెద్దపీట వేస్తున్నామని తెలిపిన సుమన్ కుమార్, ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరూ ఇన్ఫెక్షన్ సోకుతుందన్న భయంతోనే వచ్చి పోతున్నారని అన్నారు. ప్రస్తుతం ఆరు ఫర్నేస్ లు ఉండగా, మూడు మాత్రమే పనిచేస్తున్నాయని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News