Viswanathan Anand: ఎట్టకేలకు ఇంటికి చేరుకున్న చదరంగ రారాజు విశ్వనాథన్ ఆనంద్
- లాక్ డౌన్ కు ముందు యూరప్ వెళ్లిన ఆనంద్
- విమాన సర్వీసులు నిలిచిపోవడంతో జర్మనీలో చిక్కుకుపోయిన వైనం
- తాజాగా భారత్ లో వారం రోజుల క్వారంటైన్ పూర్తి
భారత చెస్ రంగంలో దిగ్గజంగా ఖ్యాతి పొందిన విశ్వనాథన్ ఆనంద్ కరోనా వైరస్ కారణంగా ఓ విచిత్రమైన పరిస్థితిలో చిక్కుకుపోయాడు. లాక్ డౌన్ ప్రకటించకముందు ఓ టోర్నీ ఆడేందుకు యూరప్ వెళ్లిన ఆనంద్... ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ విమానసర్వీసులు నిలిచిపోవడంతో జర్మనీలో ఉండిపోవాల్సి వచ్చింది. దాదాపు మూడు నెలలుగా జర్మనీలో కాలం గడిపిన విషీ ఇటీవలే భారత్ వచ్చాడు. అయితే ప్రోటోకాల్ ప్రకారం బెంగళూరులో వారం రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకుని తాజాగా ఇంటికి చేరుకున్నాడు.
చెన్నైలో తన నివాసానికి చేరుకున్న వెంటనే ఈ లెజెండరీ ప్లేయర్ తన కుమారుడు అఖిల్ ను చూసి భావోద్వేగాలకు గురయ్యాడు. సుదీర్ఘ విరామం తర్వాత కొడుకుని చూడడం ఆనందం కలిగిస్తోందని తెలిపాడు. ఇక, దేశం కాని దేశంలో చిక్కుకుపోయిన ఆనంద్ ఇంటికి రావడంతో భార్య అరుణ, కుమారుడు అఖిల్ ల సంతోషం అంతా ఇంతా కాదు.