Kumara Sangakkara: కరోనా తర్వాత జరిగే క్రికెట్ పై కుమార సంగక్కర ఆసక్తికర కామెంట్లు
- కొత్త నిబంధన ప్రకారం బంతికి ఉమ్మిని పూయకూడదు
- క్రికెట్ అనేది సామాజిక క్రీడ
- ఇకపై వార్మప్ లు కూడా ఉండకపోవచ్చు
కరోనా దెబ్బకు ప్రపంచ క్రీడా వ్యవస్థ మొత్తం స్తంభించిపోయింది. కింద స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు అన్ని పోటీలు, ఈవెంట్లు ఆగిపోయాయి. క్రీడాకారులంతా వారివారి ఇళ్లకే పరిమితమయ్యారు. గ్రౌండ్ కు వెళ్లి ప్రాక్టీస్ చేసే పరిస్థితి కూడా లేకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో కరోనా తర్వాత పరిస్థితులపై శ్రీలంక మాజీ కెప్టెన్ సంగక్కర ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కరోనా నేపథ్యంలో ఐసీసీ తీసుకున్న కొన్ని నిర్ణయాలను ఆటగాళ్లు ఎలా డీల్ చేస్తారనే విషయం ఆసక్తికరంగా ఉంటుందని చెప్పాడు.
బంతికి ఉమ్మిని పూయడం క్రికెట్లో ఎప్పటి నుంచో వస్తున్న సంప్రదాయం అనే సంగతి తెలిసిందే. కరోనా నేపథ్యంలో, కొత్త గైడ్ లైన్స్ ప్రకారం బంతికి ఉమ్మిని పూయకూడదు. దీనిపై స్టార్ స్పోర్ట్స్ షో 'క్రికెట్ కనెక్టెడ్'లో సంగక్కర మాట్లాడుతూ, ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్లు బంతికి ఒకవైపు ఉమ్మిని రుద్దడం ఎన్నో ఏళ్లుగా జరుగుతోందని... ఇప్పుడున్న ఆటగాళ్లు కూడా చిన్నప్పటి నుంచి ఆ పని చేసినవారేనని... ఇకపై కొత్త నిబంధన నేపథ్యంలో ఎలా మేనేజ్ చేస్తారో చూడాలని అన్నాడు.
క్రికెట్ అనేది సామాజిక క్రీడ అని... డ్రెస్సింగ్ రూములో గంటల సేపు గడుపుతుంటారని... పిచ్చాపాటి మాట్లాడుకోవడం జరుగుతుంటుందని సంగక్కర చెప్పాడు. ఇకపై ఇదంతా ఉండకపోవచ్చని... వార్మప్ కూడా ఉండదని... రావడం, ఆడటం, ఇంటికి పోవడం మాత్రమే ఉండొచ్చని వ్యాఖ్యానించాడు.