Brain Stroke: 80 ఏళ్ల వారిలో వచ్చే బ్రెయిన్ స్ట్రోక్స్ ను 30 ఏళ్ల వారిలోనూ తీసుకొస్తున్న కరోనా!
- కరోనా కారణంగా రోగుల్లో బ్రెయిన్ స్ట్రోక్స్
- పరిశోధన నిర్వహించిన థామస్ జెఫర్సన్ యూనివర్సిటీ
- 50 ఏళ్ల లోపు వారికీ బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తున్నట్టు గుర్తింపు
తాజాగా కరోనా మహమ్మారి గురించి మరో ఆసక్తికర అంశం వెల్లడైంది. సాధారణంగా బ్రెయిన్ స్ట్రోక్స్ వృద్ధుల్లో తీవ్రంగా వస్తుంటాయి. 70, 80 ఏళ్ల వారిలో బ్రెయిన్ స్ట్రోక్ వస్తే తట్టుకోవడం కష్టం. అలాంటిది, కరోనా వైరస్ కారణంగా 30, 40 ఏళ్ల వారిలోనూ బ్రెయిన్ స్ట్రోక్స్ సంభవిస్తున్నాయని, అది కూడా 80 ఏళ్ల వారిలో వచ్చినంత తీవ్రతతో బ్రెయిన్ స్ట్రోక్స్ కలుగుతున్నాయని థామస్ జెఫర్సన్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. తాము సాధారణ రోగుల్లో చూసిన స్ట్రోక్స్ కి, కరోనా కారణంగా కలిగే స్ట్రోక్స్ కు తేడా ఉందని పాస్కల్ జాబర్ అనే పరిశోధకుడు వెల్లడించారు.
30 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వరకు వయసున్న కొందరిపై అధ్యయనం చేపట్టగా, వారిలో భారీ స్థాయిలో బ్రెయిన్ స్ట్రోక్స్ కనిపించాయని, వారి వయసును పరిగణనలోకి తీసుకుని చూస్తే ఇది చాలా అసాధారణ అంశం అని వివరించారు. 14 మందిపై పరిశీలన జరుపగా, వారిలో చాలామందికి తాము కరోనా బారినపడ్డామని తెలియదని, తమవద్దకు బ్రెయిన్ స్ట్రోక్ తో బాధపడుతూ వచ్చారని, కానీ తాము వైద్యపరీక్షలు చేస్తే కరోనా పాజిటివ్ వచ్చిందని జాబర్ తెలిపారు. మెదడుకు రక్త సరఫరాను నియంత్రించే ఏస్2 రెసిప్టార్ పై కరోనా వైరస్ ప్రభావం చూపుతుండడం వల్లే ఇలా జరిగే అవకాశాలున్నాయని పరిశోధకులు భావిస్తున్నారు.