Supreme Court: మారటోరియం వడ్డీని తొలగిస్తే రూ. 2 లక్షల కోట్ల నష్టం... సుప్రీంకోర్టుకు వెల్లడించిన ఆర్బీఐ!
- జీడీపీలో ఒక శాతానికి ఈ నష్టం సమానం
- మారటోరియాన్ని మాత్రమే ఊరటగా భావించాలి
- వడ్డీ చెల్లించాల్సిందేనన్న రిజర్వ్ బ్యాంక్
- పిటిషన్ ను విచారణకు స్వీకరించ వద్దన్న ఆర్బీఐ
కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ విధించిన సమయంలో వివిధ రకాల రుణాల ఈఎంఐ చెల్లింపులపై ఆరు నెలల పాటు మారటోరియాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఆరు నెలల కాలంలో ఈఎంఐల చెల్లింపులు వాయిదా వేసిన ఆర్బీఐ, దానిపై వడ్డీని మాత్రం చెల్లించాల్సిందేనని తేల్చింది. మారటోరియం సమయంలో ఈఎంఐలపై వడ్డీని రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో ఓ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలుకాగా, దీనిపై స్పందించిన ఆర్బీఐ, పిటిషన్ ను విచారణకు స్వీకరించరాదంటూ, కీలక వ్యాఖ్యలు చేసింది.
ఆగస్టు 31తో మారటోరియం ముగియనుండగా, వడ్డీని తొలగిస్తే, బ్యాంకులు తీవ్రంగా నష్టపోతాయని, ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వం పోతుందని, బ్యాంకులకు రెండు లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందని ఆర్బీఐ పేర్కొంది. ఈ నష్టం జీడీపీలో ఒక శాతానికి సమానమని పేర్కొంటూ, సుప్రీంకోర్టు నుంచి అందిన నోటీసులకు సమాధానాన్ని పంపింది.
కాగా, మార్చి 27న తొలుత మూడు నెలల పాటు మారటోరియాన్ని ప్రకటించిన రిజర్వ్ బ్యాంక్, ఆపై దాన్ని మరో మూడు నెలల పాటు పొడిగించిన సంగతి తెలిసిందే. వడ్డీని తొలగించాలనడం భావ్యం కాదని, ఈ చర్యతో బ్యాంకులు అస్థిరతకు గురవుతాయని, రుణ లభ్యత మందగిస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. బ్యాంకుల వడ్డీ మార్జిన్లు పడిపోతాయని పేర్కొంది.
రుణం తీసుకోవడం అన్నది బ్యాంకు, రుణ గ్రహీత మధ్య ఏర్పడే ఓ వాణిజ్యపరమైన ఒప్పందం వంటిదని, ఇచ్చిన రుణంపై వడ్డీ రేటు కూడా అటువంటిదేనని వ్యాఖ్యానించిన ఆర్బీఐ, అందుబాటులోకి వచ్చిన మారటోరియం సదుపాయాన్ని లాక్ డౌన్ సమయంలో లభించిన ఊరటగా భావించాలని, దానిపై వడ్డీని మాత్రం కట్టాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించవద్దని విజ్ఞప్తి చేసింది.