Devineni Uma: దోసెడు ఇసుక కూడా దొరకడం లేదని మీ ఎమ్మెల్యేలు, ఎంపీ చెప్పారు: దేవినేని ఉమ
- బయలుదేరిన ఇసుకలారీలు స్టాక్ పాయింట్ కి చేరట్లేదు
- మధ్యలోనే తినేస్తున్నారు
- బల్క్ బుకింగ్ లో దోచేస్తున్నారు
- నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాలను ధిక్కరిస్తున్నారు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు. 'అమరావతి నుండి బయలుదేరిన ఇసుకలారీలు స్టాక్ పాయింట్ కి చేరకుండా మధ్యలో తినేస్తున్నారని, దోసెడు ఇసుక కూడా దొరకడం లేదని మీ ఎమ్మెల్యేలు, ఎంపీ చెప్పారు. బల్క్ బుకింగ్ లో దోచేస్తున్నారు.. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాలను ధిక్కరించి దోచేస్తున్న లక్షలాది టన్నుల ఇసుకదోపిడీపై సమాధానం చెప్పండి వైఎస్ జగన్ గారూ' అని దేవినేని ఉమ నిలదీశారు. ఈ సందర్భంగా పలు వార్తా పత్రికల్లో వచ్చిన కథనాలను ట్వీట్ చేశారు.
ఇటీవల గుంటూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో ఇసుకపై జరిగిన సమీక్షలో వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ.. తన నియోజకవర్గంలో ఎవరికైనా అవసరమైతే దోసెడు ఇసుక కూడా దొరకడం లేదని అన్నట్టు ఆ వార్తా పత్రికల్లో పేర్కొన్నారు. ఈ విషయంపై కలెక్టర్‌కు చెప్పినా ఉపయోగం లేదని చెప్పినట్లు అందులో ఉంది. అమరావతిలో ఇసుకతో బయల్దేరిన లారీ వినుకొండ రాకుండానే మాయమవుతోందని ఆయన చెప్పినట్లు పేర్కొన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలతో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా ఏకీభవించారని అందులో ఉంది.