Maharashtra: కరోనాతో అల్లాడుతున్న మహారాష్ట్ర,గుజరాత్ రాష్ట్రాలకు తుపాను గండం
- అరేబియా సముద్రంలో అల్పపీడనం
- రాగల రెండ్రోజుల్లో తుపానుగా మారే అవకాశం
- జూన్ 3 నాటికి మహారాష్ట్ర, గుజరాత్ తీరాలకు చేరువగా తుపాను
దేశంలో కరోనా వైరస్ విజృంభణకు అత్యధికంగా గురవుతున్న రాష్ట్రాలు మహారాష్ట్ర, గుజరాత్. ఇక్కడి వాణిజ్యం విదేశాలతో ఎక్కువ సంబంధాలు కలిగివుండడంతో తొలినాళ్లలోనే ఇక్కడ అత్యధిక కేసులు నమోదు కాగా, ఇప్పుడు ఆందోళన కలిగించే రీతిలో కరోనా విజృంభిస్తోంది. పరిస్థితి ఇలావుంటే, మరికొన్నిరోజుల్లో తుపాను రూపంలో మరో ముప్పు ఈ రెండు రాష్ట్రాలను పలకరించనుంది.
అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం రాగల 48 గంటల్లో తుపాను రూపు దాల్చుతుందని, ఆపై ఇది ఉత్తర దిశగా పయనించి మహారాష్ట్ర, గుజరాత్ లపై ప్రభావం చూపుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. జూన్ 3 నాటికి ఈ తుపాను ఉత్తర మహారాష్ట్ర, దక్షిణ గుజరాత్ తీరాలను చేరుకుంటుందని, దీని ప్రభావం గణనీయంగా ఉండొచ్చని ఐఎండీ వివరించింది. ఇప్పటికే కరోనాతో ఈ రెండు రాష్ట్రాలు తీవ్రంగా పోరాడుతున్నాయి. ఇలాంటి వేళ తుపాను అంటే ప్రతికూల పరిస్థితులు తప్పవని తెలుస్తోంది.
మహారాష్ట్రలో ఇప్పటివరకు 62,228 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 2,098 మంది మరణించారు. గుజరాత్ లో 15,934 మందికి కరోనా నిర్ధారణ అయింది. అక్కడ 980 మంది మృత్యువాత పడ్డారు.