Odisha: ఏసీలో మంటలు.. బీజేడీ నేత అలేఖ్ చౌదరి సహా ముగ్గురి మృతి
- షార్ట్ సర్క్యూట్ కారణంగా ఎగసిపడిన మంటలు
- అప్రమత్తమై కుటుంబ సభ్యులను బయటకు పంపిన అలేఖ్ చౌదరి
- బావమరిదిని రక్షించేందుకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన వైనం
ఒడిశాలోని బరంపురంలో జరిగిన అగ్నిప్రమాదంలో అధికార బీజేడీ నేత అలేఖ్ చౌదరి సహా ముగ్గురు వ్యక్తులు మరణించారు. అలేఖ్ చౌదరి నిద్రిస్తున్న గదిలోని ఏసీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగి గదిని చుట్టుముట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. అలేఖ్ చౌదరి నిద్రిస్తున్న గదిలోని ఏసీలో మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన వెంటనే అప్రమత్తమైన చౌదరి.. కుటుంబ సభ్యులను నిద్రలేపి బయటకు పంపించివేశారు. అనంతరం తన గదిలో నిద్రపోతున్న బావమరిది భగవాన్ పాత్రో, బంధువు సునీల్ బెహరాను కాపాడేందుకు వెళ్లారు.
అలా వెళ్లిన ఆయన ఊపిరి ఆడక గదిలోనే స్పృహ తప్పి పడిపోయారు. చౌదరి ఎంతకీ బయటకు రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారొచ్చి మంటలను అదుపు చేసి గదిలో అపస్మారక స్థితిలో పడి ఉన్న వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే వారు ముగ్గురు మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. ఆయన మృతికి అధికార పార్టీ ఎమ్మెల్యేలు సంతాపం తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.