Andhra Pradesh: ఇంటర్ ప్రైవేటు కళాశాలల్లో అడ్మిషన్లకు సంబంధించి నిబంధనలు సవరించిన ఏపీ ప్రభుత్వం
- ఒక్కో సెక్షన్ కు గరిష్టంగా 40 మందికి మాత్రమే ప్రవేశం
- జీవో 23 విడుదల
- నిబంధనలు వ్యతిరేకిస్తే చర్యలు ఉంటాయన్న మంత్రి ఆదిమూలపు
విద్యా సంస్కరణల్లో భాగంగా ఏపీ సర్కారు ఆసక్తికరమైన మార్పులు చేసింది. రాష్ట్రంలోని ఇంటర్ ప్రైవేటు కళాశాలల్లో అడ్మిషన్లకు సంబంధించి నిబంధనలు సవరించారు. ఇకపై ఒక్కో సెక్షన్ లో 40 మంది విద్యార్థులను మాత్రమే చేర్చుకోవాలని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగానే జీవో 23ని విడుదల చేశామని వెల్లడించారు. కనిష్టంగా 4 సెక్షన్లకు 160 మంది, గరిష్టంగా 9 సెక్షన్లకు 360 మంది... ఫస్టియర్, సెకండియర్ కలిపి మొత్తం 720 మాత్రమే ఉండాలని వివరించారు. గతంలో ఈ పరిమితి గరిష్టంగా 1584 మంది వరకు ఉండేదని, రాష్ట్ర విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నామని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే కాలేజీలపై చర్యలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు.