Bihar: వలస కూలీల పట్ల ఓ రైతు ఔదార్యం: వెళ్లేందుకు విమాన టికెట్లు.. దారి ఖర్చులకు తలా రూ. 3 వేలు!
- లాక్‌డౌన్ కారణంగా చిక్కుకుపోయిన పదిమంది కూలీలు
- వారి బాగోగులు చూసుకున్న రైతు
- రూ. 68 వేలతో బీహార్ వెళ్లే ఫ్లైట్ టికెట్లు
లాక్‌డౌన్ కారణంగా తన వద్ద చిక్కుకుపోయిన వలస కూలీలకు విమానం టికెట్లు కొనిచ్చి ఇంటికి పంపి పెద్ద మనసు చాటుకున్నాడో రైతు. ఢిల్లీ శివారులోని టిగిపూర్ గ్రామానికి చెందిన పప్పన్ సింగ్ పుట్టగొడుల రైతు. బీహార్‌కు చెందిన 10 మంది వలస కూలీలు ఆయన వద్ద పనిచేస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా పనిలేక ఖాళీగా ఉంటున్నప్పటికీ రైతే వారి బాగోగులు చూసుకున్నాడు. అయితే, ఎంతకాలం అక్కడ పనిలేకుండా ఉంటామని భావించిన కూలీలు ఇంటికి వెళ్లాలని అనుకున్నారు. అయితే, రవాణా అందుబాటులో లేకపోవడంతో కాలినడకనో, సైకిళ్లపైనో వెళ్లడం తప్ప మరోమార్గం కనిపించలేదు. శ్రామిక్ రైళ్లలో వెళ్లాలని ప్రయత్నించినా కుదరలేదు.
దీంతో వారి బాధలు చూసి చలించిపోయిన రైతు వారిని ఎలాగైనా ఇంటికి పంపాలని అనుకున్నాడు. వారి ఫిట్‌నెస్‌ను నిరూపించే ధ్రువపత్రాలు తీసుకున్నాడు. రూ. 68 వేలు పెట్టి నేడు పాట్నా వెళ్లే విమానానికి టికెట్లు కొనిచ్చాడు. అంతేకాదు దారిఖర్చుల నిమిత్తం తలా రూ. 3 వేలు ఇచ్చి స్వయంగా తన వాహనంలోనే విమానాశ్రయంలో దింపి వచ్చాడు. తన యజమాని చూపించిన ప్రేమకు కూలీలు చలించిపోయి కృతజ్ఞతలు తెలిపారు.