AP Legislative Council: చీఫ్ సెక్రటరీ, మండలి కార్యదర్శికి హైకోర్టు నోటీసులు!
- పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులపై విచారణ
- సెలెక్ట్ కమిటీని నియమించకపోవడంపై దాఖలైన పిటిషన్
- మండలి ఛైర్మన్ ఆదేశాలను ధిక్కరించే అధికారం ఎవరికీ లేదని వాదన
ఏపీ పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులపై సెలెక్ట్ కమిటీని నియమించకపోవడంపై దాఖలైన పిటిషన్ ను ఈరోజు హైకోర్టు విచారించింది. ఈ పిటిషన్ ను టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి దాఖలు చేశారు. పిటిషన్ తరపున సీనియర్ లాయర్ ఉన్నం మురళీధర్ వాదనలను వినిపించారు. ఈ సందర్భంగా ఆయన వాదనలను వినిపిస్తూ శాసనమండలి ఛైర్మన్ ఆదేశాలను ధిక్కరించే అధికారం ఎవరికీ లేదని అన్నారు.
వాదనలు విన్న అనంతరం ప్రభుత్వం తరపున అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, శాసనమండలి కార్యదర్శికి నోటీసులు పంపింది. తదుపరి విచారణను వచ్చే నెల 22కి వాయిదా వేసింది.