Mike Schultz: పాపం బాడీబిల్డర్!... కరోనా నుంచి కోలుకున్నా కండలు కరిగిపోయాయి!
- అమెరికాలో ఘటన
- కరోనా బారినపడిన శాన్ ఫ్రాన్సిస్కో బాడీబిల్డర్
- 86 కిలోల నుంచి 63 కిలోలకు బరువు తగ్గిన వైనం
యావత్ ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేస్తున్న కరోనా భూతం వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారినే కాదు, కండలు పెంచిన వస్తాదులను కూడా మంచాన పడేస్తోంది. అమెరికాకు చెందిన మైక్ షుల్జ్ అనే బాడీబిల్డర్ కూడా కొన్నివారాల కిందట కరోనా బారినపడ్డాడు. కాలిఫోర్నియాకు చెందిన షుల్జ్ కరోనా రక్కసితో సుమారు 6 వారాల పాటు పోరాడి విజయం సాధించాడు. అయితే, ఈ క్రమంలో ఏకంగా 23 కిలోల బరువు కోల్పోయాడు. అతడికి చికిత్స అందించిన ఆసుపత్రిలోని ఓ నర్సు అతని తాజా ఫొటోలను పోస్టు చేయడంతో అతని ఫాలోవర్లు విస్తుపోయారు.
కరోనా సోకకముందు 86 కిలోల బరువున్న షుల్జ్ కోలుకున్నాక 63 కిలోల బరువు తూగాడు. దీనిపై సదరు బాడీబిల్డర్ వ్యాఖ్యానిస్తూ, ఈ ఫొటోలను తాను ప్రదర్శించడానికి కారణం, కరోనా ఎవరికైనా సోకుతుందని చెప్పడానికేనని పేర్కొన్నాడు. ఆరు వారాల పాటు మందులతోనూ, లేదా, వెంటిలేటర్ పైనా గడపాల్సి రావడం ఎవరికైనా తప్పకపోవచ్చన్నది తన అభిప్రాయమని తెలిపాడు.