Vaccine: ఉసూరుమనిపించిన ఆక్స్ ఫర్డ్ కరోనా వ్యాక్సిన్... జంతువులపై విఫలం!
- ఇప్పటివరకు అందరిలో ఆశలు కల్పించిన ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్
- కోతులపై పరీక్షలో తేలిపోయిన వ్యాక్సిన్
- వ్యాక్సిన్ ఇచ్చినా ఇన్ఫెక్షన్ బారిన పడిన కోతులు
కరోనా మహమ్మారిని సమర్థంగా నిలువరించే వ్యాక్సిన్ కోసం యావత్ ప్రపంచం ఎదురుచూస్తున్నవేళ విఖ్యాత ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ పరిశోధకులు ముందంజ వేస్తున్నట్టే కనిపించారు. ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ సహా ఏడెనిమిది వ్యాక్సిన్ల పనితీరు ఆశాజనకంగా ఉందని డబ్ల్యూహెచ్ఓ కూడా పేర్కొంది. అయితే అందరినీ నిరాశపరుస్తూ ఆక్స్ ఫర్డ్ వర్సిటీ కరోనా వ్యాక్సిన్ జంతువులపై ప్రయోగించగా, విఫలమైంది. ఇప్పటికే ఈ వ్యాక్సిన్ ను మనుషులపైనా ప్రయోగిస్తున్నారు.
అయితే, భారత వన్యప్రాణి సంతతికి చెందిన రీసస్ మకాకే జాతి కోతులపై ప్రయోగించగా, ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయింది. ఈ వ్యాక్సిన్ ఇచ్చినా సరే కోతులకు వైరస్ ఇన్ఫెక్షన్ సోకడం శాస్త్రవేత్తలను తీవ్ర నిరాశకు గురిచేసింది. వ్యాక్సిన్ ఇవ్వని కోతుల్లో ఎంత మోతాదులో వైరస్ కు సంబంధించిన ఆర్ఎన్ఏ పదార్థాలు కనిపించాయో, ఈ వ్యాక్సిన్ ఇచ్చిన కోతుల్లోనూ అంతే మొత్తంలో ఆర్ఎన్ఏ కనిపించింది.
ఇప్పటివరకు ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ రావడానికి కొన్ని నెలల సమయం చాలని భావించిన వారంతా, తాజా ఫలితాల నేపథ్యంలో, నికార్సయిన వ్యాక్సిన్ కోసం కనీసం ఏడాది, లేకపోతే రెండేళ్లు ఎదురుచూడక తప్పదని నిర్ణయించుకున్నారు. ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ తాజా ఫలితాలతో ఇప్పుడందరి దృష్టి అమెరికా సంస్థ మోడెర్నా, చైనాకు చెందిన సినోవాక్ బయోటెక్ తయారుచేస్తున్న వ్యాక్సిన్లపై పడింది. ఈ రెండు సంస్థలు తమ వ్యాక్సిన్ల పరిశోధనలో ప్రాథమిక స్థాయిలో విజయాలు నమోదు చేసుకున్నాయి.