Doctor Sudhakar: నా కొడుకు పడుతున్న ఆవేదనను చూసి, ఈ వయసులో తట్టుకోలేకపోతున్నా: డాక్టర్ సుధాకర్ తల్లి

Doctor sudhakar mother fires on AP government

  • నా కొడుకు ఎంతో పేరు ఉన్నవాడు
  • సస్పెండ్ కాకముందు వరకు బాగున్నాడు
  • ఈ స్థితికి పోలీసులే కారణం

డాక్టర్ సుధాకర్ పట్ల విశాఖ పోలీసులు అమానుషంగా వ్యవహరించిన ఘటన కలకలం రేపింది. ఈ నేపథ్యంలో డాక్టర్ సుధాకర్ తల్లి కావేరీ బాయి మీడియాతో మాట్లాడుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సస్పెండ్ కాకముందు తన కుమారుడి మానసిక స్థితి చాలా బాగుందని ఆమె చెప్పారు. ప్రతి రోజు డ్యూటీకి వెళ్లేవాడని తెలిపారు. అయితే, ఈ నెల 7న టీడీపీ నేత అయ్యన్నపాత్రుడి ఇంటికి వెళ్లారని... దీంతో, టీడీపీ మనిషి అని చెప్పి సస్పెండ్ చేశారని అన్నారు.

మాస్కులు ఇవ్వాలని అడగడమే తన కుమారుడు చేసిన నేరం అని ఆమె అన్నారు. దీనికి, అయ్యన్నపాత్రుడికి సంబంధం లేదని చెప్పారు. అయ్యన్నపాత్రుడు ఏదో చెప్పిన తర్వాత తన కుమారుడు మాట్లాడినట్టు సృష్టించారని అన్నారు. సస్పెండ్ అయిన తర్వాత తన కుమారుడు బాగా డిస్టర్బ్ అయ్యాడని చెప్పారు.

తన కొడుకు ఎంతో పేరు కలిగిన వ్యక్తి అని... వృత్తి పరంగా ఎన్నో అవార్డులు కూడా వచ్చాయని కావేరీ బాయి తెలిపారు. డాక్టర్ అనే వాడు దొంగ పిలిచినా వెళ్తాడు, సీఎం పిలిచినా వెళ్తాడని చెప్పారు. మొత్తం ప్రభుత్వమే చేసి, తాము రాజకీయం చేశామని ఇప్పుడు అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

తన కొడుకు సస్పెన్షన్ కు ముందు ఎలా ఉండేవాడో... ఇప్పుడు కూడా అలాగే ఇంటికి రావాలని అన్నారు. తన కొడుకు ఈ స్థితికి రావడానికి పోలీసులే కారణమని మండిపడ్డారు. తన కొడుకు పడుతున్న ఆవేదనను చూసి... ఈ వయసులో తట్టుకోలేకపోతున్నానని కంటతడి పెట్టారు. తన కుమారుడికి మళ్లీ వైజాగ్ లోనే పోస్టింగ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News