Virat Kohli: సెలెక్టర్ కు లంచం ఇవ్వడానికి తన తండ్రి నిరాకరించడాన్ని గుర్తుకు తెచ్చుకున్న కోహ్లీ!
- జట్టులో ఎంపిక కావడానికి లంచం ఇవ్వాలని కోచ్ చెప్పారు
- మెరిట్ లేకపోతే ఆడాల్సిన అవసరం లేదని నాన్న స్పష్టం చేశారు
- అడ్డ దారుల్లో వెళ్లడం నాన్నకు ఇష్టం ఉండదు
ఇండియన్ ఫుట్ బాల్ టీమ్ కెప్టెన్ సునీల్ ఛెత్రీతో ఇన్స్టాగ్రామ్ లైవ్ చాట్ లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. స్టేట్ క్రికెట్ లో ఎన్నో విషయాలు జరిగాయని... వాటిలో కొన్ని చెడు అంశాలు కూడా ఉన్నాయని కోహ్లీ చెప్పాడు. జట్టులో ఎంపిక కావడానికి మెరిట్ కంటే ముఖ్యమైనదని మరొకటి కూడా ఉందని అన్నాడు.
తన తండ్రి ఎంతో కష్టపడి ఎదిగారని... వీధి దీపాల కింద చదువుకున్నారని కోహ్లీ చెప్పాడు. ఆ తర్వాత లాయర్ అయ్యారని... అంతకు ముందు మర్చంట్ నేవీలో కూడా పని చేశారని తెలిపారు. కష్టపడని వారికి తాను చెప్పే విషయం అర్థం కాదని చెప్పాడు. విజయం కోసం అడ్డదారుల్లో వెళ్లడం తన తండ్రికి నచ్చదని అన్నాడు. కష్టపడితే ఫలితం దక్కుతుందనేదే తన తండ్రి సిద్ధాంతమని చెప్పాడు.
నా కొడుకు మెరిట్ తోనే ఆడాలని... లేకపోతే ఆడాల్సిన అవసరం లేదని తన కోచ్ కు నాన్న చెప్పారని తెలిపాడు. రాష్ట్ర జట్టుకు ఎంపిక చేసేందుకు లంచం ఇవ్వాల్సి ఉంటుందని తన తండ్రికి కోచ్ చెప్పారని... అప్పుడు లంచం ఇవ్వడానికి తన తండ్రి నిరాకరించారని చెప్పాడు. ఆ తర్వాత తాను సెలెక్ట్ కాలేదని... అప్పుడు తాను ఏడ్చేశానని తెలిపాడు.
అయితే ప్రపంచం అంటే ఏమిటో ఆ ఘటన తనకు నేర్పిందని కోహ్లీ చెప్పాడు. ఎవరూ చేయలేనిది చేస్తేనే జీవితంలో మనం సాధించగలమనే విషయం అర్థమైందని తెలిపాడు.