Kona Venkat: అనుష్క సినిమాపై తేల్చిచెప్పిన కోన వెంకట్!
- 'నిశ్శబ్దం' విడుదలపై రకరకాల వార్తలు
- ఓటీటీ నుంచి నిర్మాతలకు భారీ ఆఫర్లు
- థియేటర్లలోనే రిలీజ్ అని చెప్పిన నిర్మాత
అనుష్క ప్రధాన పాత్రధారిగా హేమంత్ మధుకర్ దర్శకత్వంలో రూపొందిన 'నిశ్శబ్దం' చిత్రం విడుదలపై గత కొంత కాలంగా రకరకాల వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. లాక్ డౌన్ కారణంగా థియేటర్లలో విడుదల చేసే అవకాశం లేకపోవడంతో, ఈ చిత్రాన్ని ఓటీటీ ప్లాంట్ ఫాంపై విడుదల చేయడానికి నిర్మాతలు ప్రయత్నిస్తున్నారనీ, దానికి అనుష్క అభ్యంతరం చెబుతోందని పలు వార్తలు షికారు చేశాయి.
ఇక ఇటీవలే ఓ ఓటీటీ సంస్థ ఈ చిత్ర నిర్మాతలకు భారీ ఆఫర్ చేసిందని, దాంతో నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారనీ, అయితే లాక్ డౌన్ ముగిశాక థియేటర్లలో కూడా విడుదల చేసుకునే షరతుపై అయితే ఓకే అన్నారనీ కూడా వార్తలొచ్చాయి.
ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాతల్లో ఒకరైన కోన వెంకట్ తాజాగా దీనిపై స్పందించారు. 'సినిమా రంగానికి మేము ఓ అనురక్తితో వచ్చాం. ఎన్నో ఇబ్బందులు పడ్డాం. మేము పడ్డా శ్రమకు థియేటర్లలో ప్రేక్షకులు చూపించే ప్రతిస్పందన మాకు ప్రేరణను, ప్రాణవాయువును అందిస్తుంది. మరేదీ అలాంటి అనుభూతిని ఇవ్వలేదు. సినిమా అన్నది సినిమా హాల్స్ కోసమే.. మా ప్రాధాన్యత కూడా దానికే' అంటూ ఆయన ట్వీట్ చేశారు. దీంతో ఇక ఈ సినిమా కాస్త ఆలస్యమైనా థియేటర్లలోనే విడుదల అవుతుందనీ, ఓటీటీ వేదికగా విడుదల కాదనీ తేలిపోయింది.