Narendra Modi: ముంచుకొస్తున్న అతి తీవ్ర తుపాను 'ఎమ్ పాన్'పై ఈ సాయంకాలం ప్రధాని మోదీ కీలక భేటీ
- ప్రస్తుతం పారాదీప్‌కు దక్షిణంగా 780 కిలోమీటర్ల దూరంలో తుపాను
- క్రమంగా బలపడి పెను తుపానుగా మారుతుందని అంచనా
- ఎంహెచ్‌ఏ, ఎన్‌డీఎంఏ అధికారులతో మోదీ భేటీ
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అతి తీవ్ర తుపాను ఎమ్ పాన్ కొనసాగుతోంది. ప్రస్తుతం పారాదీప్‌కు దక్షిణంగా 780 కిలోమీటర్ల దూరంలో, పశ్చిమ బెంగాల్‌లోని దిఘాకు 930 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమై ఉంది. ఉత్తర ఈశాన్య దిశగా 8 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. క్రమంగా బలపడి పెను తుపానుగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఈ నెల 20న సాయంత్రానికి పశ్చిమ బెంగాల్-బంగ్లా మధ్య తీరాన్ని దాటే సమయంలో గాలుల వేగం 185 కిలోమీటర్ల వరకు ఉంటుందని స్పష్టం చేసింది. దీని ప్రభావంతో పలు రాష్ట్రాలతో పాటు ఉత్తర కోస్తాంధ్రలోనూ ఓ మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే సూచనలు కనపడుతున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హోంశాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమావేశంలో పాల్గొననున్నారు. ఇందులో ఎన్‌డీఎంఏ అధికారులతో పాటు పలువురు కూడా పాల్గొననున్నారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై మోదీ సూచనలు చేయనున్నారు.