RLDA: తిరుపతి, నెల్లూరు కొత్త రైల్వే స్టేషన్లు ఇలా ఉంటాయి!
- టెండర్లను ఆహ్వానించిన ఆర్ఎల్డీఏ
- ఆన్ లైన్లో సాగిన ప్రీ బిడ్డింగ్ ప్రక్రియ
- పోటీలో జీఎంఆర్, రిలయన్స్, గోద్రో, ఓబెరాయ్
- వెల్లడించిన ఆర్ఎల్డీయే వీసీ వేద్ ప్రకాశ్
ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి రైల్వే స్టేషన్ ఎంత బిజీగా ఉంటుందో అందరికీ తెలిసిందే. తిరుపతితో పాటు నెల్లూరు రైల్వే స్టేషన్ పునర్ అభివృద్ధికి మార్గం సుగమమైంది. ఈ రెండు రైల్వే స్టేషన్ల అభివృద్ధికి ఆన్ లైన్ ప్రీ బిడ్ సమావేశాలు ముగియగా, రైల్ ల్యాండ్ డెవలప్ మెంట్ అధారిటీ (ఆర్ఎల్డీఏ) నిర్వహించిన ఈ సమావేశాల్లో తిరుపతిని రూ. 510 కోట్లతో, నెల్లూరును రూ. 130 కోట్లతో అభివృద్ధి చేయించేందుకు నిర్ణయించారు. ఈ అభివృద్ధి పనులు స్మార్ట్ సిటీస్ మిషన్ స్కీమ్ లో భాగంగా జరుగనున్నాయి. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రైల్వే స్టేషన్లు తయారు కానుండగా, టెండర్ పనులు జూన్ లో ఖరారు కానున్నాయి.
దాదాపు 25 నుంచి 30 మంది కాంట్రాక్టర్లు ఈ పనులను దక్కించుకునేందుకు పోటీ పడుతుండటం గమనార్హం. జీఎంఆర్, ఓబెరాయ్, యాంబియన్స్, గోద్రేజ్ ప్రాపర్టీస్, రిలయన్స్ ఇన్ఫ్రా, శోభా, బ్రిగేడ్, ఎంబసీ గ్రూప్ తదితర కంపెనీలు ఈ కాంట్రాక్టును దక్కించుకునేందుకు పోటీ పడుతున్నాయి.
ఆర్ఎల్డీఏ ఇప్పటికే ఈ రైల్వే స్టేషన్ల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించింది. రెండు స్టేషన్లనూ పీపీఈ (పబ్లిక్, ప్రైవేట్ పార్ట్ నర్ షిప్) విధానంలో అభివృద్ధి చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. కాగా, డీబీఎఫ్ఓటీ (డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్ ఫర్) మోడల్ లో ఇవి అభివృద్ధి చెందనున్నాయని ఆర్ఎల్డీఏ వైస్ చైర్మన్ వేద్ ప్రకాశ్ దుడేజా వెల్లడించారు. కాంట్రాక్టులను పొందిన వారు మూడేళ్లలోగా పనులను పూర్తి చేయాల్సి వుంటుందని వివరించారు.
లాక్ డౌన్ నేపథ్యంలో ఈ కాంట్రాక్టు ఖరారు ప్రక్రియను ఆన్ లైన్ ద్వారానే నిర్వహించనున్నామని, ప్రీ బిడ్డింగ్ సమావేశాలు విజయవంతంగా పూర్తి అయ్యాయని ఆయన వెల్లడించారు. ఈ కాంట్రాక్టు కారణంగా వాణిజ్య అభివృద్ధితో పాటు స్థానికులకు ఉపాధి, టూరిజం విభాగాలు సైతం అభివృద్ధి చెందనున్నాయని ఆయన అన్నారు.