Kadapa District: కడప జిల్లా నందలూరులో అలజడి.. మృతదేహాన్ని ఖననం చేయనివ్వకుండా అడ్డుకున్న గ్రామస్థులు!
- పూణేలో మృతి చెందిన పుష్పలత (50)
- మరణం తర్వాత పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
- చెయ్యేరు నది వద్ద ఖననానికి ఏర్పాట్లు
- ఒప్పుకోని స్థానికులు.. నచ్చచెబుతున్న పోలీసులు
కరోనా మహమ్మారి దేశాల ఆర్థిక వ్యవస్థలను కుదేలు చేయడమే కాకుండా మనుషుల్లో మానవత్వాన్ని కూడా చంపేస్తోంది. కరోనాతో మృతి చెందిన వారి మృతదేహాలను ఖననం చేయనివ్వకుండా సొంత గ్రామ ప్రజలే అడ్డుపడుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కడప జిల్లా నందలూరు మండలం ఆడపూరులో ఇటువంటి ఘటనే చోటు చేసుకుంది.
ఆ గ్రామానికి చెందిన పుష్పలత (50) అనే మహిళ మహారాష్ట్రలోని పూణేలో మృతి చెందింది. మరణం తర్వాత చేసిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులు పోలీసుల సాయంతో నందలూరు తీసుకొచ్చారు. మృతదేహాన్ని నందలూరులోని చెయ్యేరు నది వద్ద ఖననానికి ఏర్పాట్లు చేశారు.
అయితే, స్థానికులు ఇందుకు ఒప్పుకోలేదు. వారంతా అక్కడకు చేరుకుని మృతదేహాన్ని ఇక్కడ ఖననం చేయొద్దని ఆందోళనకు దిగారు. దీంతో అధికారులు, పోలీసులు గ్రామస్థులతో చర్చలు జరుపుతున్నారు. మృతదేహాన్ని ఖననం చేస్తే వచ్చే ప్రమాదం ఏమీ ఉండదని నచ్చచెబుతున్నారు.