Danish Kaneria: నా కెరీర్ ను నాశనం చేశాడు: అఫ్రిదీపై కనేరియా ఫైర్
- మొదటి నుంచి నన్ను వ్యతిరేకిస్తూనే వచ్చాడు
- అఫ్రిదీ వల్లే నా వన్డే కెరీర్ నాశనమైంది
- దీనికి మతమే కారణం
తన కెరీర్ ను పాకిస్థాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిదీ నాశనం చేశాడని ఆ దేశ మాజీ స్పిన్నర్ డ్యానిష్ కనేరియా ఆరోపించాడు. తన కెరీర్ మొత్తం అఫ్రిదీ తనను కించపరుస్తూనే ఉన్నాడని మండిపడ్డాడు. కరాచీలో పీటీఐతో మాట్లాడుతూ, తొలి నుంచి అఫ్రిది తనను వ్యతిరేకిస్తూనే వచ్చాడని అన్నాడు. డొమెస్టిక్ క్రికెట్ కానీ, అంతర్జాతీయ వన్డేలు కానీ... తన పట్ల అతని తీరు ఒకేలా ఉండేదని విమర్శించాడు. ఒక వ్యక్తి నిరంతరం ద్వేషిస్తూనే ఉన్నాడంటే... దానికి కారణం మతం కాకపోతే ఇంకేమి ఉంటుందని అన్నాాడు.
అఫ్రిదీ వల్లే తాను ఎక్కువ వన్డేలు ఆడలేకపోయానని కనేరియా ఆవేదన వ్యక్తం చేశాడు. అఫ్రిదీ లేకపోతే తాను 18 కంటే ఎక్కువ వన్డేలు ఆడేవాడినని చెప్పాడు. అఫ్రిదీ ఎప్పుడూ ఇతరులనే సపోర్ట్ చేసేవాడని అన్నాడు. పాకిస్థాన్ కోసం తాను ఎంతో క్రికెట్ ఆడానని... ఇంతకంటే తనకు కావాల్సింది మరేముందని చెప్పాడు. తాను ఎప్పుడూ వన్డే జట్టులో ఉండేవాడినని... అయితే ఆడేందుకు అవకాశం మాత్రం వచ్చేది కాదని అన్నాడు. తన మాదిరే అఫ్రిదీ కూడా లెగ్ స్పిన్నర్ కావడం కూడా ఒక కారణమని చెప్పాడు. ఒక పెద్ద స్టార్ అయిన అఫ్రిదీ తన పట్ల ఎందుకు అలా ప్రవర్తించాడో అర్థం కాలేదని తెలిపారు.
పాకిస్థాన్ జట్టుకు ఆడిన రెండో హిందూ క్రికెటర్ కనేరియా కావడం గమనార్హం. అంతకు ముందు కనేరియా తల్లి తరఫు బంధువు అనిల్ దల్ పత్ పాకిస్థాన్ తరపున ఆడాడు. అనిల్ 61 టెస్టుల్లో 261 వికెట్లు పడగొట్టాడు.